BPSC Protest | బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) నిర్వహించిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సీసీఈ) తిరిగి నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఆదివారం వీరి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పాట్నాలో ఆందోళనకారులను నిలువరించేందుకు వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు.
తొలుత గాంధీ మైదాన్‌కు చేరుకున్న బీపీఎస్సీ అభ్యర్థులు జేపీ గోలంబార్ మీదుగా సీఎం నితీశ్ కుమార్ అధికారిక నివాసం వైపు ర్యాలీగా బయలుదేరారు. వీరి ప్రదర్శనను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఈ అంశంపై సీఎంతో భేటీకి ఆందోళన కారులు డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల ప్రయోగాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఏ) శుక్రవారం ‘చక్కా జామ్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. జేపీ గోలంబర్ వద్ద మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినిపించేందుకు ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని ప్రకటించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిని కలిసేందుకు విద్యార్థులు నిరాకరించారు.
పది రోజులుగా బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రశ్నాపత్రం లీకైందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే బీపీఎస్సీ పరీక్ష నియంత్రణాధికారి రాజేశ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామ్ రద్దు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఏప్రిల్ నెలలో మెయిన్ పరీక్ష జరుగుతుందని, అందుకు సన్నద్ధం కావాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.