జైపూర్: రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ రైతు కుటుంబానికి పోలీసులు రూ.9.91 లక్షలు జరిమానా విధించారు. విద్యాధర్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 10న చితిపై కూర్చున్నారు. తమకు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరిని కాపాడటం కోసం ఒక ఏఎస్పీ, ఇద్దరు డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్లు సహా మొత్తం 99 మంది పోలీసు సిబ్బందిని నియమించారు.
వీరితోపాటు అధికారిక వాహనాలను కూడా ఉపయోగించారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.9,91,577 ఖర్చయింది. ఈ సొమ్మును ఈ నెల 24నాటికి ఎస్పీ కార్యాలయంలోని అకౌంట్స్ బ్రాంచ్లో జమచేయాలని యాదవ్కు ఝుంఝును ఎస్పీ శరద్ చౌదరి నోటీసు ఇచ్చారు.
రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలను ఈ నోటీసులో ప్రస్తావించారు. ఈ సొమ్మును చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ వద్ద తీసుకున్న భూములకు శ్రీ సిమెంట్ కంపెనీ నష్టపరిహారం చెల్లించడం లేదని యాదవ్ ఆరోపించారు. ఈ నిరసన నేపథ్యంలో ఆ కంపెనీ రూ.3 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది.