Home Minister Amit Shah | సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మోదీ సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ‘జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ‘ఆర్టికల్ 370’ ను కాంగ్రెస్ రద్దు చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలే కారణం అని, ఫలితంగా ఉగ్రవాద చర్యలు పెరిగినా ఆ పార్టీ అడ్డుకోలేకపోయిందని సోమవారం హర్యానాలోని కర్నల్ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ చెప్పారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ 2019లో రెండోసారి అధికారంలోకి రాగానే 370 అధికరణాన్ని రద్దు చేయడంతో కశ్మీర్ లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్నదన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో కొలువు దీరేది మోదీ సర్కారేనని, త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భారత్ లో విలీనం అవుతుందన్నారు.
మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పాల్గొనలేదని అమిత్ షా ఆరోపించారు. ‘ఖర్గే జీ.. 80 ఏండ్ల వయస్సులో ఉన్న మీరు దేశం పరిస్థితి సరిగ్గా అర్థం చేసుకోలేక పోయారు. కానీ కశ్మీర్ కోసం హర్యానా యువత తమ ప్రాణాలు ఇవ్వగలరు` అని అన్నారు.