PM Modi | న్యూఢిల్లీ, మే 22: వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతిసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంటున్నది. అందుకు ఉదాహరణే కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం. 10 డిసెంబరు 2020లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన మోదీ.. ఈ నెల 28న వీర్ సావర్కర్ 140వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు భవనాన్ని ప్రారంభించి అందులో తొలి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అధికారం ప్రధానికి ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రతిపక్షాలు కూడా ఇదే విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రాజ్యాంగంలోని 79వ అధికరణంలో పార్లమెంటుకు పేర్కొన్న నిర్వచనం ప్రకారం.. కేంద్రానికి ఓ పార్లమెంటు ఉండాలి. అందులో రాష్ట్రపతి, రెండు సభలు ఉండాలి. వీటిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ ద పీపుల్ అని అంటారు. కార్యనిర్వాహక అధికారం మాత్రమే ప్రధానికి ఉంటుంది. శాసనవ్యవస్థపై పార్లమెంటుకు, న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారాలుంటాయి. మొత్తంగా ఈ మూడు వ్యవస్థలపై రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయి. రాజ్యాంగం చెబుతున్నది ఇదే. కాబట్టి ఏరకంగా చూసినా పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, ఇమేజీ పెంచుకోవాలని నిరంతరం తపించే మోదీకి ఇవేవీ పట్టడం లేదు. తగుదునమ్మా అంటూ పార్లమెంటు భవన ప్రారంభానికి సిద్ధం అవుతుండడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప మరోటి కాదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో మరోలా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ప్రారంభించిన తెలంగాణ కొత్త సచివాలయం చుట్టూ బీజేపీ మురికి రాజకీయాలు చేసింది. రాష్ట్ర ప్రథమ పౌరురాలు, కార్యనిర్వాహక అధిపతి అయిన గవర్నర్‌ను ఆహ్వానించరా? అని దుమ్మెత్తి పోశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ప్రభుత్వంపై స్వయంగా పలు విమర్శలకు దిగారు.
మరి నేడు చేస్తున్నదేంటి?
ఇప్పుడు పార్లమెంటు భవనాన్ని ప్రధానితో ప్రారంభించాలనుకోవడం ద్వారా బీజేపీ ద్వంద్వ వైఖరి కనబరుస్తున్నది. బీజేపీ వైఖరిపై ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అధికారం రాష్ట్రపతికి లేదా? అని ఆర్జేడీ నేత మనోజ్ ఝా, సీపీఐ అగ్రనేత రాజా మోదీపై దుమ్మెత్తిపోశారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారని.. మోదీ, ఆయన స్నేహితుల సొంత డబ్బుతో కట్టినట్టు ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించడం సిగ్గుచేటని ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మెత్తి పోసింది.
రామ్‌నాథ్ కోవింద్‌ను పక్కనపెట్టి..
న్యూఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించాల్సి ఉండగా ఆయనను పక్కకునెట్టి 2019లో మోదీనే ప్రారంభించారు. తన సంకుచిత మనస్తత్వాన్ని, రాజ్యాంగ వ్యవస్థలపై తన ఆధిపత్య ధోరణని ప్రదర్శించే పనిలో మరోసారి బీజేపీ పడింది.
పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని ప్రారంభించిన కేఆర్ నారాయణన్
ఇప్పటికి సరిగ్గా 21 సంవత్సరాల క్రితం 2002లో నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనం సంసదీయ జ్ఞానపీఠ్‌ను అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ అదే ఏడాది మే 7న ప్రారంభించారు. దీనిని బట్టి చూసినా ప్రస్తుత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సింది రాష్ట్రపతి ముర్మునే. కాబట్టి లోక్‌సభ స్పీకర్ ద్వారా లోక్‌సభ సచివాలయం ద్రౌపది ముర్ముకు ఆహ్వానం పంపాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, మోదీ వచ్చాక వ్యవస్థలు, రాజ్యాంగం తూతూమంత్రంగా మారాయి. అన్నింటిలోనూ తానే కనిపించాలన్న అభిలాష ఆయనను ప్రతిదాంట్లోనూ వేలు పెట్టేలా చేస్తున్నది.