(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : పహల్గాం ఉగ్రదాడికి కారణమై, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెడతామని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. అయితే, ఆ వాగ్దానాలు మాటలకే పరిమితమయ్యాయి గానీ, కార్యరూపం దాల్చలేదు. మిగతా దేశాల విషయం అటుంచితే, పాక్‌కు వ్యతిరేకంగా మిత్ర దేశాల మద్దతును కూడా ఎన్డీయే ప్రభుత్వం కూడగట్టలేకపోయింది. మరోవైపు, ఇంతకాలం మిత్రులుగా ఉన్న పొరుగు దేశాలు కూడా చైనా చక్రబంధంలో చిక్కుకొని భారత్‌కు క్రమంగా దూరమవుతున్నాయి. ఇలా మొత్తంగా 11 ఏండ్ల పాలనలో విదేశాంగ విధానంలో, విదేశీ దౌత్యంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా తొలి నుంచీ భిన్న వైఖరిని అవలంబించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో తాము జోక్యం చేసుకోబోమని తొలుత అమెరికా చెప్పుకొచ్చింది. అయితే, 24 గంటలు తిరక్కముందే.. భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు తాను మధ్యవర్తిత్వం వహించానని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. విరమణకు సంబంధించిన ప్రకటన చేస్తూ.. పాక్‌ను, భారత్‌ను ట్రంప్ ఒకేగాటిన కట్టడంతో పాటు ఇరుదేశాలను ఉద్దేశించి ‘కామన్సెన్స్’ అనే వ్యాఖ్యలను చేశారు. ట్రంప్‌ను తన ఆప్తమిత్రుడిగా చెప్పుకొనే మోదీ.. ఈ విషయంపై ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అమెరికా వైఖరిని ప్రశ్నించలేదు. ఇవన్నీ విశ్లేషిస్తే, పాక్‌ను దోషిగా నిలబెట్టే విషయంలో అమెరికా సాయాన్ని తీసుకోవడంలో మోదీ దౌత్యం ఏమీ పనిచేయలేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ దక్కకుండా అడ్డుకోవడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైంది.
యూఏఈ, భారత్‌కు మధ్య దశాబ్దాలుగా మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. అయితే, పహల్గాం దాడులు జరిగిన సమయంలోనే యూఏఈ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయాద్ పాకిస్థాన్‌లో పర్యటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. అంతేకాదు, ఇరు దేశాలు ఉద్రిక్తతలకు పాల్పడకుండా శాంతి చర్చలు చేపట్టాలని యూఏఈ మొక్కుబడిగా ప్రకటించడం, కాల్పుల విరమణ ప్రకటన చేయడానికి అమెరికాతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాదు.. యూఏఈ దౌత్యం అద్భుతమంటూ పాక్ బహిరంగంగానే ప్రశంసించింది. భారత్‌కు మిత్ర దేశంగా ఉన్న యూఏఈ.. ఇలా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే మోదీ సర్కారు ఏం చేస్తున్నదన్న వాదనలు పలువురు తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇక, భారత్-పాక్ ఉద్రిక్తతలపై తొలుత చైనా స్పందిస్తూ.. తాము ఎల్లప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. అయితే, కాల్పుల విరమణ తర్వాత మాత్రం.. పాక్‌కు అన్ని విషయాల్లో అండగా ఉంటామని ప్రకటించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకమన్న చైనా.. అదే ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్‌కు సపోర్ట్ చేయడమేంటి? దీన్ని మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా ఎందుకు అడ్డుకోలేకపోయింది? అనే సందేహాలను పలువురు దౌత్యవేత్తలు లేవదీస్తున్నారు. ఇక, 26 మంది ప్రాణాలు కోల్పోయిన పహల్గాం ఉగ్రదాడిపై ఏ మాత్రం స్పందించని భారత్ మరో మిత్ర దేశం కొలంబియా.. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాక్‌లో జరిగిన ప్రాణనష్టంపై విలవిల్లాడిపోయింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేసింది. దీన్ని కూడా మోదీ ప్రభుత్వం తొలుత ఖండించలేదు. సర్వత్రా విమర్శలు రావడంతో శశిథరూర్ నేతృత్వంలోని బృందం కొలంబియాపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆ ప్రకటనను కొలంబియా వెనక్కి తీసుకొంది. మొత్తంగా ఈ పరిణామాలను విశ్లేషిస్తే.. పహల్గాం ఉగ్రదాడి విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలో మోదీ ప్రభుత్వం విఫలమయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
11 ఏండ్ల పాలనలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమయినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌కు పొరుగున ఉన్న దాదాపు అన్ని మిత్ర దేశాలూ ఇప్పుడు భారత్‌కు దూరమై చైనాకు అనుకూలంగా మారడాన్ని దీనికి ఉదాహరణగా చూయిస్తున్నారు. మాల్దీవుల్లో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు వ్యతిరేకిగా పేరుపొందిన మహమ్మద్ ముయిజ్జు గెలిచి అధ్యక్షుడయ్యారు. చైనా నుంచి పెద్దయెత్తున రుణాలు వస్తుండటంతో వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై ఆయన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సరిహద్దు కయ్యాలతో భారత్‌లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌తో చైనా లోగుట్టు మైత్రీ బంధం బహిరంగ రహస్యమే. ఇక, బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వం, గతంలో చైనాతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొన్న భూటాన్‌తో పాటు మారిషస్ కూడా చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో ఇప్పుడు సత్సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. శ్రీలంకలో తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనుర కుమార దిసనాయకే మార్క్సిస్ట్ నేత. వెరసి భారత్ చుట్టూరా ఉన్న పొరుగు దేశాలన్నీ ఇండియాను కాదని చైనా స్నేహ హస్తాన్ని కోరుకొంటున్నాయి. దీంతో డ్రాగన్ కుయుక్తులను తిప్పికొట్టడంలో దౌత్యపరంగా మోదీ ఫెయిలయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.