PM Modi : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో జరగనుంది. ఇటీవలే ఒకసారి ఈ అంశంపై క్యాబినెట్ భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు మార్చి 22న మోదీ ఈ భేటీ నిర్వహించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో చమురు రవాణా, లభ్యత, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలపై ఈ భేటీ జరగనుంది.
అలాగే, ఈ సంక్షోభం కారణంగా తలెత్తే పరిస్తితులపై కూడా చర్చిస్తారు. దేశంలో సెక్యూరిటీ, వ్యూహాత్మక అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అతిపెద్ద వ్యవస్థ సీసీఎస్. ఇందులో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. అలాగే, ఆర్థిక పరమైన అంశాలతో సంబంధం ఉన్న మరో రెండు, మూడు శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా ఈ భేటీకి హాజరవుతారు. వ్యవసాయం, రవాణా, వాణిజ్యం, రైల్వేలు, షిప్పింగ్, పెట్రోలియం, విద్యుత్, ఆహారం, ఎరువులు, వైమానిక రంగాలపై పడే ప్రభావాన్ని ఈ సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే దేశంలో చమురు సంక్షోభం తలెత్తింది. విమానయాన రంగంపై కూడా ప్రభావం పడుతోంది. విమానాలకు సంబంధించిన చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్ రంగంపైనా ప్రభావం ఉంటుంది. ఇలాంటి అంశాల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. ఈ పరిణామాల్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ భేటీ జరుగుతుంది.