TVK MLA : తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) సమావేశాలకు ఓ మహిళా ఎమ్మెల్యే (Woman MLA) తన పసిబిడ్డతో హాజరవడం చర్చనీయాంశంగా మారింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ పల్లవి (R Pallavi), కొన్ని నెలల వయసున్న తన బిడ్డను ఎత్తుకుని కొన్నాళ్లుగా అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఈ ఉదంతంపై సోషల్మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పల్లవి తన బిడ్డను సహాయకురాలి పర్యవేక్షణలో ఉంచి, విరామ సమయాల్లో పసికందు బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పసిబిడ్డను తీసుకువచ్చి అసౌకర్యం కలిగిస్తున్నారంటూ కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఒక తల్లిగా పసిబిడ్డను సంరక్షించుకుంటూనే, ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారంటూ పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.
ఈ విమర్శలపై ఎమ్మెల్యే పల్లవి స్పందించారు. బిడ్డకు కొన్ని నెలలే వయసే కావడంతో ఇంట్లో వదిలి రావడం సాధ్యం కాదని, ఒక తల్లిగా నా బాధ్యతలను, ఎమ్మెల్యేగా నా విధులను ఏకకాలంలో నిర్వర్తించడంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. నేను కేవలం నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప, ఎవరికీ ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.