Bihar : టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బిహార్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఏకంగా 32,388 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ (టీఆర్ఈ-4.0) పేరిట బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
స్కూల్ టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని, అర్హతగల భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బిహార్ విద్యాశాఖ సూచించింది. బిహార్ టీఆర్ఈ-4.0 ప్రకారం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ వచ్చే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు సెప్టెంబర్ 29 తుది గడువుకాగా, దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. ఖాళీల వివరాల్ని కూడా బీపీఎస్ఈ వెల్లడించింది. దీని ప్రకారం 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు ఉపాధ్యాయ ఖాళీలు 3,847; 6 నుంచి 8వ తరగతి వరకు ఖాళీలు 8,563; 9, 10 తరగతుల టీచర్ల ఖాళీలు 3,877; 11, 12 క్లాసుల కోసం టీచర్ల ఖాళీలు 16,101.
దరఖాస్తు ప్రక్రియను అభ్యర్థులు పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలని, నిబంధనలు పరిశీలించాలని బీపీఎస్సీ సూచించింది. అర్హత పరీక్ష ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు చెల్లించే వేతనాల వివరాల్ని కూడా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదిలోనే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్సైట్ సంప్రదించాలని సూచించింది.