భోపాల్ : గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా పరిగణిస్తే తాము మాత్రం వారి సంక్షేమానికి పాటుపడతామని ప్రధాని నరేంద్ర మోదీ (Madhya Pradesh Polls) అన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబువ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గిరిజన జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకూ బాలికలకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్‌లో తమ పిల్లల భవిష్యత్ కోసం పాటుపడితే బీజేపీ గిరిజన బిడ్డల భవిష్యత్ కోసం పనిచేస్తోందని అన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కొలువుతీరినా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేయడం, ప్రాజెక్టులు ముందుకు సాగకుండా అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటాయని ఆరోపించారు. దోపిడీ, అవినీతి, వేధింపులు, అసత్యాలే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండా అని మోదీ దుయ్యబట్టారు.
తనకు మూడోసారి అవకాశమిస్తే భారత్‌ను ప్రపంచంలో మూడు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా ఎదిగేలా చేస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత్ అయిదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించామని, త్వరలోనే మనం మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదుగుతామని నిపుణులు చెబుతున్నారని అన్నారు. వేగంగా ఎదుగుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.
Read More :