విశాఖపట్నం: యోగాద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. యోగాకు వయసుతో పనిలేదని, యోగాకు హద్దులు లేవు అని తెలిపారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ యోగాదినోత్సంలో భాగంగా విశాఖపట్నంలో ‘యోగా ఫర్ వన్ ఎర్త్-వన్ హెల్త్’ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సంతర్భంగా మాట్లాడుతూ. యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయన్నారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని చెప్పారు.
యోగా అనేది మానవతను పెంచే సామూహిక ప్రక్రియ అని, గత పదేండ్లలో కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. ప్రకృతిలో మనిషి భాగస్వామి అని యోగా గుర్తు చేస్తుందన్నారు. దీంతో వ్యక్తిగత క్రమశిక్షణ అలవడుతుందని, నేను అనే భావన మనంగా మారుతుందని వెల్లడించారు. అది మానవత్వాన్ని పెంచుతుందని చెప్పారు. ప్రపంచంలో అశాంతి, అస్థిరత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యోగాతో శాంతి, స్థిరత్వం సాధించవచ్చని, అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలని సూచించారు.
భారతీయ సంస్కృతి అందరి క్షేమం కాంక్షిస్తుందని తెలిపారు. యోగాపై దేశంలోని అనేక వైద్యసంస్థలు పరిశోధన చేస్తున్నాయని, పలు చికిత్సా విధానాల్లో కూడా భాగం చేస్తున్నాయన్నారు. గుండె, నరాల సమస్యలకు యోగా పరిష్కారంగా మారుతున్నదని వెల్లడించారు. మానసిక ఆరోగ్యానికి కూడా యోగా సహాయపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ చికిత్సా కేంద్రంగా భారత్ మారుతుందని తెలిపారు. ఊబకాయం ప్రస్తుతం ప్రపంచ సమస్యగా మారుతున్నదని, పది శాతం నూనె వాడకం తగ్గిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. అందువల్ల వంటల్లో పది శాతం నూనె తగ్గింపును చాలెంజ్‌గా స్వీకరించాలన్నారు. ప్రపంచ శాంతికి యోగా ఒక మార్గమని ప్రధాని మోదీ అన్నారు.