PM Modi | న్యూఢిల్లీ, జూన్ 6: దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ 9న ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత ఆయన శనివారం ప్రమాణం చేస్తారని వార్తలు వెలువడగా, దానిని ఆదివారం సాయంత్రానికి మార్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. స్వతంత్ర భారతంలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రమాణం చేస్తున్న వారిలో మోదీ రెండో వారు. కాగా, మోదీని తమ నేతగా ఎన్నుకునేందుకు శుక్రవారం ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు.
మోదీని ఎన్నుకున్న తర్వాత ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీనియర్ నేతలు నారా చంద్రబాబునాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తదితరులు ప్రధానితో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. తమ కూటమికి మద్దతు ఇస్తున్న ఎంపీల లిస్టును వారు రాష్ట్రపతికి సమర్పిస్తారు. మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పలు దేశాల అధినేతలకు ఆహ్వానం పంపారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్, భూటాన్, మారిషస్, సీసెల్స్ దేశాధినేతలు హాజరయ్యే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి.