(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అదే సమయంలో తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాంనకు కూడా ఎన్నికలు జరగబోనున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో బీజేపీ, మిజోరాంలో ఎన్డీయే మిత్ర పక్షం అధికారంలో ఉండగా రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రమే భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారు. బీజేపీయేతర రాష్ర్టాలపై వివక్ష చూపిస్తున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే మధ్యప్రదేశ్‌లో ఆయన ఏడు సార్లు పర్యటించారు. ప్రధాని హోదాలో ఇప్పటి వరకు ఈ పదేండ్ల కాలంలో మధ్యప్రదేశ్‌లో పర్యటించడం ఇది 34వ సారి.
తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం ఉదారంగా నిధులు అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా విభజన చట్టంలో తెలంగాణకు అనేక హామీలను, ప్రాజెక్టులను చట్టబద్ధంగా కేంద్రం ప్రకటించింది. వాటిని కనీసం నెరవేర్చకపోగా తెలంగాణను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు (హైదరాబాద్, హన్మకొండ) వచ్చిన సందర్భంగా రాష్ర్టానికి వరాలు ప్రకటిస్తారని, విభజన హామీలను నెరవేరుస్తారని ప్రజలు గంపెడాశతో ఎదురు చూసినా రూపాయి ఇవ్వలేదు. వరాల ఊసే ఎత్తలేదు. కానీ బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు ఈ ఏడాది వెళ్లిన ఏడు పర్యాయాలలో వరాల జల్లు కురిపించారు.