న్యూఢిల్లీ : కేంద్ర-రాష్ర్టాలు, వివిధ రాష్ర్టాల మధ్య సమన్వయం, సహకారం కోసం అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు, తొమ్మిది మంది కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. శాశ్వత ఆహ్వానితులుగా 13 మంది కేంద్ర మంత్రులకు స్థానం కల్పించారు. ఎన్డీయే కూటమిలోని జేడీయూ, జేడీఎస్, టీడీపీ, ఎల్జేపీ పార్టీలకు దీనిలో చోటు దక్కింది. దేశంలో సహకార సమాఖ్యతత్వాన్ని పెంపొందించేందుకు బలమైన వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ఈ మండలిని పునరుద్ధరించినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఈ మండలిలో సభ్యులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జగత్ ప్రకాశ్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మల సీతారామన్, మనోహర్‌లాల్ ఖట్టర్, రాజీవ్ రంజన్ సింగ్ వురపు లలన్ సింగ్, వీరేంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు నియమితులయ్యారు.