PM Modi | న్యూఢిల్లీ : పాక్ అణు సామర్థ్య బ్లాక్ మెయిలింగ్ను ఇక సహించేది లేదు.. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. భారత మిస్సైళ్లు పాక్ రక్షణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే మిస్సైళ్లు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత్ మిస్సైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాలిలోకి ఎగరలేని స్థితిని భారత్ కల్పించింది అని మోదీ పేర్కొన్నారు.
పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పింది. భారత్ ప్రతిచర్యలకు బెంబేలెత్తిన పాక్.. కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్.. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతులు మేరకే చర్చలు ఉంటాయి. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు ఉంటాయన్నారు మోదీ.