ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్‌పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్‌ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయన కొంచెం వ్యంగ్యం, కొంచెం హెచ్చరిక మేళవించి ఇలా అన్నారు.
‘మీ సీఎంకు ధన్యవాదాలు చెప్పానని చెప్పండి. నేను భటిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో తిరిగి చేరుకున్నాను’
పంజాబ్‌లో ఎన్నికల సభకు బయల్దేరిన ప్రధాని మోదీ ‘రైతుల నిరసన (?)’తో తన పర్యటనను రద్దు చేసుకొన్నారు.
సభా స్థలి వరకు వెళ్లకుండా సగం నుంచే వెనక్కి మరలి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయారు.
ఇది కేంద్రం, బీజేపీ చెప్తున్న అఫీషియల్ వర్షన్
ప్రధానమంత్రి ఒకరు ఇలా ప్రజా నిరసనకు
వెరిచి తనటూర్ను రద్దు చేసుకుని, దారి మధ్య నుంచే వెనుదిరగడం స్వతంత్ర భారత
చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి.
ఇది కండ్లముందు కనిపించిన వాస్తవం
ఎన్నికల పంజాబ్‌లో 42,750 వేల కోట్ల పనులకు
శంకుస్థాపన చేయనున్నట్టు మోదీ పొద్దున్నే ట్వీట్ చేశారు.
పంజాబ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీగా
70 వేల మందితో సభ జరిపి రికార్డు సృష్టిస్తామని రాష్ట్ర బీజేపీ నేత అశ్వనీకుమార్ శర్మ ఒక్కరోజు ముందే ప్రకటించారు.
ఫిరోజ్‌పూర్ సభలో జనం కోసం 70 వేల కుర్చీలు
కూడా వేశారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు?
మరి అంత భారీ సభను అంత ఈజీగా ఎందుకు రద్దు చేసుకున్నారు?
గగన మార్గాన వెళ్లాల్సిన ప్రధాని ఆఖరి క్షణంలో రోడ్డు మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
వీవీఐపీ అయిన ప్రధాని టూర్‌ను అలా ఆఖరి క్షణంలో మార్చడం సాధ్యమా?
అసాధారణ భద్రత ఉండే ప్రధానమంత్రిని, ఆందోళన చేస్తున్న రైతుల ముందు, 20 నిమిషాల పాటు ఉంచుతారా?
భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఇది సాధ్యమా?
అదంతా నిజమేనని నమ్మించేందుకే…
ప్రధానమంత్రి తన పంజాబ్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడంపై దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావేత్తలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. వాస్తవ పరిస్థితుల నుంచి తప్పించుకొని తిరిగే నైజం ఇంకెన్నాళ్లని తమ ట్వీట్ల ద్వారా ఫేస్బుక్లో పోస్టుల ద్వారా ప్రశ్నించారు. వైఫల్యాలను కప్పిపుచ్చి ఎన్నాళ్లు పబ్బం గడుపుకుంటారని విమర్శించారు. ఏడాదికాలంగా రైతులపై సానుభూతి వ్యక్తం చేయని ప్రధాని ఇప్పుడు కూడా పంజాబ్ రైతుల నిరసనను కారణంగా చూపి వెనక్కి తిరగడం అతి పెద్ద నాటకమని తిట్టిపోశారు. ప్రధాని లాంటి వ్యక్తి నిరసనల మధ్య 20 నిమిషాల పాటు ఉంటాడా అని మరో నెటిజన్ ప్రశ్నించారు.
ఇదంతా నిజమని నమ్మించే ప్రయత్నంలో భాగమేనని అందుకే ఇలా చేశారని తూర్పారబట్టారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించని రైతులు వెనక్కి వెళ్లేందుకు ఎలా అనుమతించారని మరో నెటిజన్ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతమంది భద్రత ఉండగా వందమంది రైతులు అక్కడికి ఎలా వస్తారని ట్విట్టర్లో నిలదీశారు. ‘పదివేల మంది భద్రతా సిబ్బంది కేవలం వంద మందిని ఆపలేకపోయారా?’ అని ఫేస్బుక్లో మరొకరు వ్యాఖ్యానించారు. ఆందోళన చేస్తున్న రైతుల మధ్య కమ్యూనికేషన్ అంత పటిష్ఠంగా ఉంటే అంత సాఫీగా ఆయన తిరిగి ఎయిర్ పోర్టుకు ఎలా వెళ్లగలిగారని సందేహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన షెడ్యూల్ ఇది. రోడ్డు మార్గంలో ప్రయాణం షెడ్యూల్లో లేనే లేదు. అయితే చివరి నిమిషంలో మార్పులు చేసినట్టు కేంద్రం చెబుతున్నది. ఆ చివరి నిమిషం ఎప్పుడో స్పష్టంచేయలేదు.
‘తెలంగాణ నుంచి మొదలుకొని ఢిల్లీ బడా నేత వరకు అందరూ డ్రామా ఆర్టిస్టులే. ఒకరిని మించి మరొకరు రక్తి కట్టిస్తున్నారు’ అంటూ కొందరు తెలంగాణ నెటిజన్లు వ్యంగ్యవ్యాఖ్యలు చేశారు.
‘తిమ్మిని బమ్మి చేయాలె. తిప్పి తిరకాసు పెట్టాలె. మెదడును కరిగించాలె. అబద్ధాల్ని రంగరించాలె. పగటి వేషమొకటి కట్టాలె. నెపం దేనిమీదికో నెట్టాలె. కట్టుకథ ఒకటి కనిపెట్టాలె. వైరి పక్షాన్ని తిట్టాలె. ‘ప్రధానమంత్రి’ కుర్చీకుండే పరువు గంగలో కలిస్తేనేం!
కిందపడ్డా నాదే పైచేయి అనాలె! ఇదే కదా రాజకీయమంటే? గల్లీ బండి నుంచి ఢిల్లీ బడా నేత దాకా బీజేపీ నేతలకు ఇదే రాజకీయం! ఇందుకు తాజా నిదర్శనం’ – అంటూ మరో విద్యావేత్త ట్వీట్ చేశారు.