Ayushman Bharat | న్యూఢిల్లీ: కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ఇక నుంచి 70 ఏండ్ల పైబడిన అందరికీ వర్తించనుంది. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఢిల్లీలో వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద 70 ఏండ్ల వయసు దాటిన అందరికీ ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఉచిత వైద్యం అందనుంది.
వయోవృద్ధులు ఉచిత చికిత్స పొందేందుకు వీలుగా ‘ఆయుష్మాన్ వయ వందన కార్డు’లను అందించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. కాగా, ఈ పథకాన్ని ఢిల్లీ, బెంగాల్ ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో అమలు చేయడం లేదని మోదీ ఆరోపించారు. ఇక్కడి వయో వృద్ధులను ఆయన క్షమాపణ కోరారు. మరో రూ.12,850 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు ప్రాజెక్టులను సైతం మోదీ ఆవిష్కరించారు.
మధుమేహం, జీవక్రియకు సంబంధించిన రుగ్మతల చికిత్సలో ఆయుర్వేద వినియోగం కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను, దేశవ్యాప్తంగా 11 ఎయిమ్స్ దవాఖానల్లో డ్రోన్ సేవలను సైతం మోదీ ప్రారంభించారు.