హైదరాబాద్, అక్టోబర్ 16 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలు, అలసత్వంతో దేశంలో నిరుద్యోగం తీవ్రమవుతున్నది. ఐటీ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఎన్డీయే ప్రభుత్వం పెడుతున్న కొత్త కొర్రీలతో పింఛన్‌దారులు లబోదిబోమంటున్నారు. దౌత్య సంబంధాలు విఫలమవ్వడంతో ఎగుతులు పడిపోయి వాణిజ్యలోటు అంతకంతకూ పెరుగుతున్నది. మొత్తంగా నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రగతి అధోగతిపాలవుతున్నది. ఈ మేరకు తాజాగా విడుదలైన నివేదికలను బట్టి అర్థమవుతున్నది.
దేశంలో నిరుద్యోగ తీవ్రత మరింత పెరిగింది. ఆగస్టులో 5.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పెరిగింది. 15-29 ఏండ్ల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగిత రేటు 14.6 శాతం నుంచి 15 శాతానికి ఎగబాకింది. పురుషుల్లో నిరుద్యోగిత రేటు 5 శాతం నుంచి 5.1 శాతానికి పెరగ్గా, మహిళల్లో ఇది 5.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఇది 6.7 శాతం నుంచి 6.8 శాతానికి ఎగబాకింది. ఈ మేరకు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) తాజా నివేదికలో వెల్లడైంది. ఆర్హతకు తగిన ఉద్యోగం కోసం యువత ఏండ్లుగా ఎదురుచూస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి తగిన సహాయ, సహకారాలు అందట్లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందనడానికి తాజా గణాంకాలే నిదర్శనమని చెప్తున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్ ఇండస్ట్రీలో ప్రారంభమైన కుదుపులు ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశం కనిపిస్తున్నది. 2023, 2024లో దాదాపు 25 వేల మంది టెకీలు భారత్‌లో ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. రానున్న 90 రోజుల్లో 50 వేల టెకీలకు ఉద్వాసన ఉండనున్నట్టు సమాచారం. ఉద్యోగులను వదిలించుకునేందుకు ఐటీ కంపెనీలు రకరకాల కారణాలు వెతుకుతున్నాయి. అందులో ‘నాసిరకం పనితీరు’ కూడా ఒకటి. ఈ కారణంగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకపోవడమో, లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనో ఉద్యోగులను కోరుతున్నాయి.
ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగులను రహస్యంగా పెద్ద సంఖ్యలో తొలగించినట్టు హెచ్ఎఫ్ఎస్ రిసెర్చ్ సీఈవో ఫిల్ ఫెర్స్ట్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య 55 వేల నుంచి 60 వేల వరకు ఉంటుందని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతిశర్మ అంచనా వేశారు. అతిపెద్ద కంపెనీలైన టీసీఎస్, యాక్సెంచర్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 12 వేల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని టీసీఎస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంటే కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఇది దాదాపు 2శాతం. యాక్సెంచర్ ఈ ఏడాది జూన్-ఆగస్టు మధ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మందిని ఇంటికి పంపింది.
పింఛన్‌దారులు, ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తాజాగా ప్రకటించిన సవరణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్‌దారులకు, ఉద్యోగాలు కోల్పోయినవారికి ఈపీఎఫ్‌వో కొత్త రూల్స్ ఇబ్బందికరంగా మారినట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పింఛన్ విత్‌డ్రా కాలపరిమితిలో సవరణలతో వేతనజీవులకు కొత్త ఇబ్బందులు కలుగవచ్చని, ఈపీఎఫ్‌వో బాధ్యత నుంచి తప్పించుకొనేందుకే కేంద్రం 100 శాతం విత్‌డ్రాను తెరమీదకు తీసుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ భారం తగ్గించుకొనేందుకే ఇలా చేసిందని చెప్తున్నారు. మొత్తంగా మన పింఛన్ విధానం వేతనజీవుల పాలిట క్రూరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. దీన్ని ధ్రువపరుస్తూ.. గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్-2025 ర్యాంకుల్లో భారత్ అట్టడుగున నిలిచింది.
కవరేజీ, సమర్థత, నియంత్రణ అనే మూడు విషయాల్లో మన దేశీయ పింఛన్ వ్యవస్థ పేలవమైన ప్రదర్శనను కనబర్చింది. దీంతో నిరుడు మన పింఛన్ వ్యవస్థకు 44 మార్కులు ఉంటే ప్రస్తుతం అది 43.8కి పడిపోయి.. గ్రేడ్ డీ ర్యాంకుకు పరిమితమైంది. ఈ మేరకు మెర్సెర్ సీఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్-2025 వెల్లడించింది. ఇక, అమెరికా, జపాన్, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి ఓఈసీడీ సభ్య దేశాల (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) పెన్షన్ ఆస్తులు (వివిధ స్టాక్స్‌లో పెట్టుబడులు) ఆయా దేశాల జీడీపీలో 80 శాతం మేర ఉంటే, భారత్‌లో మాత్రం ఇది 21 శాతం మాత్రమే ఉన్నట్టు ఆర్థిక సర్వే 2024-25 పేర్కొంది.
దేశంలో ఎగమతులు, దిగుమతులు మధ్య వ్యత్యాసానికి సూచికగా ఉండే వాణిజ్య లోటు గత నెలలో 13 నెలల గరిష్ఠాన్ని తాకింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో వాణిజ్య లోటు 32.15 బిలియన్ డాలర్లకు చేరుకొన్నది. గడిచిన 13 నెలల వ్యవధిలో ఇదే అత్యధికం. బంగారం, వెండి, ఎరువుల దిగుమతులు పెరుగడమే దీనికి కారణమని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. అమెరికా సుంకాల మోత కూడా ఎగుమతులపై ప్రభావాన్ని చూపించిందని, మోదీ దౌత్య వైఫల్యమే దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, శక్తిమంతమైన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో భారత్ 80వ ర్యాంకు నుంచి 85వ ర్యాంకుకు పడిపోయింది
అమెరికాకు భారతీయ వస్తూత్పత్తుల ఎగుమతులు భారీగా క్షీణించాయి. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్టులో విధించిన టారిఫ్‌లు.. సెప్టెంబర్‌లో స్పష్టమైన ప్రభావం చూపాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యానికి గాను ఆగస్టు 7 నుంచి 25 శాతం ప్రతీకార సుంకాలను అమల్లోకి తెచ్చిన ట్రంప్.. తన మాట వినకుండా రష్యా నుంచి భారీగా ముడి చమురు దిగుమతుల్ని కొనసాగిస్తున్నందుకు గాను అదే నెల 27 నుంచి మరో 25 శాతం జరిమానా సుంకాలను వర్తింపజేశారు. దీంతో అమెరికాలో దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం సుంకాల భారం పడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు గడిచిన నాలుగు నెలల్లో 37.5 శాతం మేర పతనమయ్యాయి. ఈ ఏడాది మేలో 8.8 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు సెప్టెంబర్‌లో 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు చెప్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు, ఆర్థి మాంద్యం భయాలు వెరసి బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. తులం బంగారం రూ.1.30 లక్షలకు చేరువైంది. అయితే, 8,133 టన్నుల మేర గోల్డ్ రిజర్వులు ఉన్న అమెరికా తదితర దేశాలకు ఈ పరిణామం ఉపయుక్తంగా మారగా, కేవలం 880 టన్నుల నిల్వలు మాత్రమే ఉన్న భారత్ తదితర దేశాలకు ఇది ఇబ్బందిగా మారింది. డిమాండ్‌కు సరిపడా పుత్తడి సరఫరాకు భారత్ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్నది. ఇదే క్రమంలో పన్నుల నుంచి తప్పించుకొనేందుకు బంగారం స్మగ్లింగ్ ఘటనలు భారీగా పెరిగాయని కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గోల్డ్ నిల్వలపై కేంద్రానికి ముందుచూపు లేకపోవడంతో సామాన్యులకు బంగారం కొనుగోలు కలగానే మారినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిరుద్యోగం, ఉద్యోగాల కోత, ఆర్థిక సంక్షోభంతో ఒకవైపు దేశవ్యాప్తంగా సవాలక్ష సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోని కేంద్రప్రభుత్వం హిందీ భాషను అంతటా రుద్దాలన్న తన ప్రయత్నాలను మాత్రం వదులుకోవట్లేదు. ఆదివాసీ పిల్లలు చదువుకొనే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో హిందీ బోధనకు సంబంధించి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. హిందీ భాషను బోధించే బాధ్యత కేవలం ఆ భాష ఉపాధ్యాయుడిది మాత్రమే కాదని, సంబంధిత పాఠశాలలో పని చేస్తున్న లెక్కలు, సైన్స్, సాంఘిక శాస్ర్తాల ఉపాధ్యాయులు కూడా హిందీని బోధించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో కేంద్రం ఏకపక్ష చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.