న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. శుక్రవారంతో (జూలై 25) ఆయన ప్రధాని పదవిని చేపట్టిన 4,708 రోజులు పూర్తిచేసుకున్నారు. దీంతో దేశానికి ఏకబిగిన ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నిలిచారు. దివంగత ఇందిరాగాంధీ 1966, జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు 4,077 రోజులు ప్రధానిగా ఉన్నారు. అయితే దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) మొదట ఆ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. 2014, మే 26న నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యలు చేపట్టారు. అనంతరం జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో వరసగా మూడు లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని అందించిన ఘనత నెహ్రూ, మోదీలకు దక్కుతుంది.
అదేవిధంగా స్వాతంత్య్రం తర్వాత జన్మించి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన కాంగ్రెసేతర వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. లోక్‌సభలో రెండు సార్లు పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలో వచ్చిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా ఆయన చరిత్రల్లోకెక్కారు. ఇందిరాగాంధీ (1971) తర్వాత అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టిన ప్రధానిగా నిలిచారు. ఇక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోదీకే చెందుతుంది. 2001, అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రి అయిన మోదీ, 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అప్పటినుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులందరిలో వరసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీపక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీగా రికార్డు సృష్టించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2002, 2007, 2012 ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. అదేవిధంగా 2014, 2019, 2024లో ప్రధాని అభ్యర్థిగా కమలం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
1950లో మోదీ జన్మించారు. హీరాబెన్, దామోదర్ దాస్ మోదీ దంపతులకు ఆయన మూడో సంతానం. విద్యార్థి దశలోనే ఆర్‌ఎ్‌సఎ్‌సలో చేరి స్వయంసేవక్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. అతికొద్దికాలంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మోదీని ఎల్కే ఆడ్వాణీ ప్రోత్సహించారు. 1990లో ఆడ్వాణీ రథయాత్రలో మోదీ పాల్గొన్నారు. 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి-కశ్మీర్ ఏక్తా యాత్రకు మోదీ జాతీయ ఇన్చార్జిగా పనిచేశారు. 2001లో గుజరాత్ సీఎం అయ్యారు.
గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తీరుపై తీవ్రవిమర్శలొచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి సైతం వచ్చాయి. అయినప్పటికీ 2014 మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు గుజరాత్ సీఎంగా పనిచేశారు. తన హాయాంలో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మోదీ గెలిపించారు.