Post Union Budget 2024-25 Conference : 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్ధ మెరుగ్గా ఉందని చూపేందుకు బడ్జెట్లో భారీ ప్రకటనలు గుప్పించేదని, క్షేత్రస్ధాయిలో వాటి అమలును పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ దిశగా ప్రస్ధానం అనే అంశంపై కేంద్ర బడ్జెట్ 2024-25పై సీఐఐ నిర్వహించిన సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. పధకాలను పూర్తి చేసేందుకు గత ప్రభుత్వాలు శ్రద్ధ కనబరచలేదని దుయ్యబట్టారు.
గత పదేండ్లుగా తాము ఆ పరిస్ధితిని మార్చివేశామని ప్రధాని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే తాము రైల్వే బడ్జెట్ను 8 రెట్లు పెంచామని, హైవేల బడ్జెట్ను 8 రెట్లు, వ్యవసాయ బడ్జెట్ను 4 రెట్లు పెంచామని తెలిపారు. రక్షణ బడ్జెట్ను రెండింతలు పైగా పెంచామని చెప్పుకొచ్చారు. యూపీఏ హయాంలో లక్షలాది కోట్ల రూపాయల విలువైన అవినీతి కుంభకోణాలు వెలుగుచూసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. తాము శ్వేతపత్రం రూపంలో దేశ ఆర్ధిక వ్యవస్ధ ముఖచిత్రాన్ని దేశ ప్రజల ముందుంచామని చెప్పారు. మనం ఎక్కడ ఉన్నామనేదానిపై చర్చ జరగాలని చెప్పారు.
భారత పరిశ్రమలను నూతన శిఖరాలకు చేర్చామని తెలిపారు. దేశ అభివృద్ధికి మూలధన వ్యయం కీలకమని 2004లో యూపీఏ తొలి బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం రూ. 90,000 కోట్లు కాగా, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ. 11 లక్షల కోట్లు పైగా మూలధన వ్యయం వెచ్చిస్తోందని ఈ నిధులతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇవాళ మనం వికసిత్ భారత్ దిశగా పయనిస్తున్నామని, ఈ మార్పు కేవలం సెంటిమెంట్లతో రాలేదని, ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రపంచంలో మనం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఎదిగామని, భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Husband Birthday | భర్తంటే ఎంత ప్రేమో.. చెట్టుకు భర్త డ్రెస్ తొడిగి జయంతి వేడుక