PM Modi : ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మణిపూర్ (Manipur) సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆ ఐదు రాష్ట్రాల్లో మిజోరం (Mizoram), అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal), బీహార్ (Bihar) రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నెల 13 నుంచి 15 వరకు అంటే రేపటి నుంచి సోమవారం వరకు ఈ పర్యటనలు జరగనున్నాయి. ఈ పర్యటనల్లో భాగంగా ప్రధాని మొత్తం రూ.71,850 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు మిజోరం రాజధాని ఐజ్వాల్‌లో రూ.9000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు మణిపూర్‌లోని చురాచంద్పూర్లో రూ.7,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంఫాల్‌లో రూ.1200 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి బహిరంగసభలో మాట్లాడనున్నారు.
సాయంత్రం 5 గంటలకు అస్సాం రాజధాని గువాహటికి చేరుకోనున్నారు. అక్కడ భారత రత్న భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. ఆదివారం అస్సాంలో రూ.18,530 కోట్ల విలువైన పారిశ్రామిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11 గంటలకు డర్రాంగ్లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమెటెడ్ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు గోలాఘాట్‌లో నుమాలిగఢ్ రిఫైనరీని ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.
సోమవారం ఉదయం 9.30 గంటలకు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 16వ ‘కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025’ ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం బీహార్‌కు వెళ్లి పూర్నియా ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ బిల్డింగును ప్రారంభిస్తారు. అనంతరం పూర్నియాలో రూ.36 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ బహరింగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేషనల్ మఖానా బోర్డును ప్రారంభిస్తారు.