PM Modi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) లో శక్తిమంతమైన నిర్ణయాలు చేసే కమిటీ బుధవారం సమావేశమైంది. పహల్గాం (Pahalgam) ఉగ్రవాద ఘటనకు ప్రతీకారంగా ఎలాంటి చర్య తీసుకోవాలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. దాంతో భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
దాంతో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి చర్య తీసుకోబోతోందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం ఈ ఉత్కంఠకు మరింత ఊతమిస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటికే రెండుసార్లు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఇవాళ రెండో సమావేశం జరిగింది. కేంద్రంలో శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రధాని నేతృత్వంలోని ఈ సీసీఎస్ కమిటీకి ఉంటుంది.
ఈ నెల 23న జరిగిన తొలి సమావేశంలో ఈ కమిటీ పాకిస్థాన్‌కు సింధూ జలాల నిలిపివేత సహా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ రెండో భేటీ నిర్వహించింది. సీసీఎస్ రెండో భేటీ అనంతరం రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) సమావేశమైంది. పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై ఈ కమిటీలో చర్చించారు.
పై రెండు కేబినెట్ కమిటీల సమావేశం అనంతరం కేంద్రంలోని టాప్ మంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రెండు కేబినెట్ కమిటీల్లో చర్చించిన అంశాలపై టాప్ మంత్రులతో ప్రధాని మంతనాలు జరిపారు. మంగళవారం ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీకి లేఖలు రాశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని ఆ లేఖల్లో డిమాండ్ చేశారు.