తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను కేరళలో అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) గురువారం మరోసారి స్పష్టం చేశారు. అలాగే సీఏఏపై కాంగ్రెస్ మౌనాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ కూటమిలో కాంగ్రెస్ మిత్రపక్షంగా తమ పార్టీ ఉందని తెలిపారు. అయితే రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఈ అంశంపై ఇంకా మాట్లాడకపోవడాన్ని విజయన్ విమర్శించారు. సీఏఏ నోటిఫై చేసిన తర్వాత కాంగ్రెస్ తీసుకున్న వైఖరిని ఆయన నిలదీశారు. సీఏఏకు వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ నుంచి కాంగ్రెస్ వైదొలిగిందని విజయన్ ఆరోపించారు. భారతదేశ ఆలోచనకు సీఏఏ సవాలుగా నిలుస్తుందని, మతపరమైన వివక్షకు దారి తీస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో సీఏఏపై కేరళ తలవంచబోదని, మౌనంగా ఉండదని స్పష్టం చేశారు.
కాగా, పౌరసత్వం అనేది కేంద్ర అంశమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దీంతో సీఏఏ అమలులో రాష్ట్రాలకు ఎలాంటి ఛాయిస్ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రతిచోట సీఏఏ వర్తిస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గురువారం పేర్కొంది. తన వ్యాఖ్యలతో దేశ ప్రజలను విజయన్ మోసగిస్తున్నారని ఆరోపించింది.