న్యూఢిల్లీ: ఫిజియోథెరపిస్టులు (Physiotherapists) వైద్యులు కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) పేర్కొంది. ఈ నేపథ్యంలో వారి పేరు ముందు ‘డాక్టర్’ అని వాడొద్దని ఆదేశించింది. అలా వినియోగిస్తే భారతీయ వైద్య డిగ్రీల చట్టం 1916 చట్టం కింద ఉల్లంఘనకు పాల్పడిన వారవుతారని హెచ్చరించింది. సెప్టెంబర్ 9న డీజీహెచ్ఎస్కు చెందిన డాక్టర్ సునీతా శర్మ ఈ మేరకు ఒక లేఖ జారీ చేశారు. ‘ఫిజియోథెరపిస్టులు వైద్యులుగా శిక్షణ పొందలేదు. అందువల్ల ‘డాక్టర్’ అని పేరు ముందు ఉపయోగించకూడదు. రోగులు, సాధారణ ప్రజలను ఇది తప్పుదారి పట్టిస్తుంది. అలాగే మోసపూరిత వైద్యానికి దారితీయవచ్చు’ అని పేర్కొన్నారు.
కాగా, ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలిని ఉద్దేశించి రాసిన లేఖలో ఈ విషయాన్ని డాక్టర్ సునీతా శర్మ స్పష్టం చేశారు. ఫిజియోథెరపిస్టులను ప్రాథమిక సంరక్షణ ప్రాక్టీస్‌కు అనుమతించకూడదని తెలిపారు. సూచించిన రోగులకు మాత్రమే వారు చికిత్స చేయాలని పేర్కొన్నారు. పాట్నా, మద్రాస్ హైకోర్టులతోపాటు దేశంలోని ఇతర కోర్టులు జారీ చేసిన తీర్పులు, వైద్య మండళ్ల ఆదేశాలను ఈ సందర్భంగా ఉదహరించారు. ఫిజియోథెరపిస్టులు, వృత్తి చికిత్సకులు ‘డాక్టర్’ హోదా ఉపయోగించడాన్ని నిషేధించినట్లు గుర్తు చేశారు. ఉల్లంఘించిన వారు ఐఎంఏ చట్టంలోని సెక్షన్ల కింద చర్యలకు బాధ్యలవుతారని హెచ్చరించారు.
కాగా, ఫిజియోథెరపిస్టులు ఇప్పుడు తమ పేరుకు ముందు ‘డాక్టర్’ చివరన ‘పీటీ’ అని ఉపయోగించవచ్చని నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (ఎన్‌సీఏహెచ్‌పీ) ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ పాఠ్యాంశాలను ప్రారంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఈ పరిణామం నేపథ్యంలో డీజీహెచ్ఎస్ తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చింది. ‘ఫిజియోథెరపీ కోసం ఆమోదించిన సిలబస్ 2025 కరికులంలో ఫిజియోథెరపిస్టులను ‘డాక్టర్’ అనే వాడకాన్ని వెంటనే తొలగించాలని పేర్కొంది. ప్రజలు, రోగులకు అస్పష్టత కలిగించకుండా, ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు మరింత సముచితమైన, గౌరవప్రదమైన శీర్షికను పరిగణించవచ్చని ఆ లేఖలో సూచించింది.
Also Read:
Regional Political Parties Income | 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
Watch: కదులుతున్న లారీపై చోరీ.. వీడియో వైరల్, ఆరుగురు అరెస్ట్
Watch: రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమాని.. అధికారులు ఏం చేశారంటే?