PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఈ అంశం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ కూడా చేరారనడం నిజం కాదని వెల్లడించింది.
ఈ నెల 24, మంగళవారం నాడు మోదీతో ట్రంప్ మాట్లాడారు. ఈ ఫోన్ కాల్లో మస్క్ కూడా చేరినట్లు ఈ ప్రచారం మొదలైంది. నిజానికి ఇలా జరగడం నిబంధనలకు విరుద్ధం. అంతర్జాతీయంగా ప్రముఖులైన ఇరు దేశాధినేతల మధ్య జరిగే ఫోన్ సంభాషణలు చాలా రహస్యంగా ఉంటాయి. ఇతరులు ఎవరికీ ఆ ఫోన్ కాల్స్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. అవసరాన్ని బట్టి సంబంధిత అధికారులకు మాత్రమే అవకాశం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాని, ప్రైవేటు వ్యక్తులు ఈ ఫోన్ కాల్స్‌లో పాల్గొనే అవకాశం లేదు. పైగా యుద్ధం సమయంలో ఇరు దేశాధినేతల మధ్య మరొకరికి చోటుండదు. ఈ నేపథ్యంలో మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్ పాల్గొన్నారనే ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ అంశంపై కేంద్రం స్పందించింది.
ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో నిజం లేదని తేల్చింది. ఈ ఫోన్ కాల్లో మోదీ, ట్రంప్ మాత్రమే పాల్గొన్నారని, ఇరువురు మాత్రమే చర్చించారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం, శాంతి స్థాపన వంటి అంశాలపై మాత్రమే ఇరువురు దేశాధినేతలు చర్చించినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ఈ ప్రచారానికి భారత్ తెరదించింది.