న్యూఢిల్లీ: జనగణనలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు! ఢిల్లీ మొదలుకొని పంజాబ్, మహారాష్ట్ర వరకు వివిధ రాష్ర్టాల్లో మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. చాలా మంది తమ ఆస్తులు, వ్యక్తిగత వివరాలను వెల్లడించడం లేదు. తలుపులు తీసి మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. ఆస్తులు, కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తే ఆదాయ పన్ను శాఖ లాంటి ఏజెన్సీలు స్క్రూటినీ చేస్తాయని భయపడుతున్నారు. దీంతో వాళ్లను సముదాయించడానికి మండే ఎండల్లో ఎన్యుమరేటర్లు అవస్థలు పడుతున్నారు.
కొందరు అసంపూర్తి సమాచారం ఇస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. జన గణనకు, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నా రు. నగరాల్లో చాలా మంది ఇంటి బయటే ఎన్యుమరేట్లతో మాట్లాడుతున్నారు. గ్రామాల్లో మాత్రం చాలావరకు ఇంట్లోకి రానిచ్చి మాట్లాడుతున్నారు. మురికివాడల ప్రజలు మాత్రం ప్రభుత్వం తమకు కావాల్సిన సంక్షేమ పథకాలను అందిస్తుందన్న ఆశతో చాలా వివరాలను వెల్లడిస్తున్నారు.