మద్దూర్, ఆగస్టు 17 : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రైతుల భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి తన నియోజకవర్గంలో కబ్జాలపై మౌనంగా ఎందుకున్నాడో? కనీసం ప్రజలకైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత కబ్జా కారణంగా భూములు కోల్పోయిన రైతులతో కలిసి సోమవారం ఆయన నారాయణపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో రైతుల దగ్గర భూసేకరణ చేసిన రేవంత్ సర్కార్ వారి భూములను అన్యాయంగా ఆక్రమించి కబ్జా చేసిందని ఆరోపించారు. హకీంపేటకు చెందిన సీఎం బినామీ నర్సింహారెడ్డి రైతుల భూములను రికార్డుల్లో తారుమారు చేసి కబ్జా చేశాడని ధ్వజమెత్తారు. అతడి కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వార్తలు ప్రచురిస్తే ఆ పత్రికపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
రైతుల భూములను కబ్జా చేయకపోతే అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. సీఎం అండతో రెచ్చిపోతూ అధికార బలాన్ని ప్రయోగిస్తూ రైతుల భూములను కబ్జా చేసి రూ.కోట్లు దండుకున్నాడని విమర్శించారు. భూములను కబ్జా చేసిన సదరు కాంగ్రెస్ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కబ్జా చేసి కోట్లు దండుకున్న విషయాన్ని లోకాయుక్తలో ఫిర్యాదు చేశామని, రైతులకు న్యాయం జరిగేవరకు వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కొడంగల్ ప్రజలు కాంగ్రెస్ను నమ్మి.. ఓట్లేసి గెలిపిస్తే వారి భూములనే మింగేస్తారా? అని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగే వరకు కొనసాగే పోరాటంలో ప్రభుత్వం తనపై అక్రమంగా కేసు నమోదు చేసినా భయపడేది లేదని, రైతుల కోసం మరోసారి జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. అనంతరం మహిళా రైతు బాబమ్మ, నర్సింహులుతోపాటు పలువురు అక్కడికి చేరుకుని తమ భూమి పత్రాలను మీడియాకు చూపించారు. తమకు ఉన్న భూముల కన్నా తక్కువ భూములను చూపిస్తూ కాంగ్రెస్ నేతలు అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎదుట వాపోయారు. భూములు కాజేసిన వారిని ఉపేక్షించేది లేదని, వారిని న్యాయస్థానానికి లాగి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని నరేందర్రెడ్డి రైతులకు భరోసానిచ్చారు.