Adani Group | గాంధీనగర్, మార్చి 4: గుజరాత్లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న బీజేపీ, అదే రాష్ర్టానికి చెందిన ప్రధాని మోదీ స్నేహితుడు గౌతమ్ అదానీని ఇల్లరికం అల్లుడిలా మేపుతున్నది. ఎంత రేటు పెంచినా అదానీ సంస్థల నుంచే విద్యుత్తును కొనుగోలు చేస్తూ, గుజరాత్ ప్రజల సొమ్మునంతా ఆయన జేబుల్లో నింపుతున్నట్టు ఆ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. ఎక్కడైనా ప్రభుత్వం ప్రైవేటు కంపెనీతో విద్యుత్తు కొనుగోలు కోసం ఒప్పందం చేసుకొంటే ఐదారేండ్ల వరకు యూనిట్ ధరలో మార్పు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటాయి. కానీ, గుజరాత్లో అదానీ పవర్ ఏడాది వ్యవధిలో ఏకంగా 102 శాతం విద్యుత్తు ధర పెంచినా ప్రభుత్వం కిక్కురుమనకుండా చెల్లిస్తున్నది. ధర పెంచటం ఇంకా సంతోషం అన్నట్టు ఆ కంపెనీ నుంచి విద్యుత్తు కొనుగోలును మరింత పెంచటం గమనార్హం.
గుజరాత్ ప్రభుత్వం అదానీ పవర్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నది. సొంత వనరులను గాలికి వదిలేసి పూర్తిగా అదానీ గ్రూప్‌పైనే ప్రభుత్వం ఆధారపడటంతో ఆ సంస్థ తన ఇష్టం వచ్చినట్టు రేటు పెంచేస్తున్నది. 2021 జనవరిలో యూనిట్‌కు రూ.2.83 చొప్పున విద్యుత్తు ఇచ్చిన అదానీ పవర్, 2022 డిసెంబర్ నాటికి యూనిట్‌కు రూ.8.83కు పెంచేసింది. అంటే రెండేండ్ల వ్యవధిలో ఏకంగా యూనిట్‌పై రూ.6 పెంచిందన్నమాట. ఈ లెక్కలు గుజరాత్ ప్రభుత్వమే ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే శనివారం బయటపెట్టింది. అదానీ పవర్ నుంచి ఎంత విద్యుత్తు కొంటున్నారు? యూనిట్‌కు ఎంత ధర చెల్లిస్తున్నారు? అని సభలో ఆమ్ఆద్మీ పార్టీ సభ్యుడు హేమంత్ అహిర్ అడిగిన ప్రశ్నకు బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు లిఖతపూర్వక సమాధానం ఇచ్చింది.
ఏ వస్తువుకైనా ధర పెరిగితే కొనుగోలు (డిమాండ్) తగ్గుతుంది అన్నది ఆర్థికశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాల్లో ఒకటి. కానీ, గుజరాత్లో.. అందునా అదానీ పవర్ విషయంలో ఈ సూత్రం తిరగబడింది. అదానీ పవర్ విద్యుత్తు ధరను పెంచుతున్నకొద్దీ ఆ సంస్థ నుంచి ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలును కూడా పెంచుకొంటూ పోవటం విచిత్రం. 2021-22 మధ్య యూనిట్‌పై రూ.6 ధర పెంచినా, అదానీ సంస్థ నుంచి గుజరాత్ ప్రభుత్వం అంతకుముందు కంటే 7.5 శాతం అధికంగా విద్యుత్తును కొనుగోలు చేసింది. మొత్తంగా రెండేండ్లలో విద్యుత్తు కొనుగోలు కోసం గుజరాత్ ప్రభుత్వం అదానీ పవర్‌కు రూ.8,160 కోట్లు చెల్లించింది. ఈ లెక్కలు కూడా ప్రభుత్వం చెప్పినవే.
గుజరాత్ ప్రభుత్వానికి 25 ఏండ్ల పాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు 2007లో అదానీ పవర్ ఒప్పందం చేసుకొన్నది. ఈ 25 ఏండ్లలో యూనిట్ ధరను రూ.2.35 నుంచి రూ.2.89 వరకు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఒప్పందంలో కూడా ఈ రేటు స్పష్టంగా ఉన్నది. అయితే, తాము ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకొంటున్నామని, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయని సాకు చెప్తూ 2011 తర్వాత అదానీ గ్రూప్ ఉత్పత్తిని, సరఫరాను తగ్గిస్తూ వచ్చింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగానే కేంద్రం గుజరాత్-అదానీ ఒప్పందంలో జోక్యం చేసుకొన్నది. దీంతో అదానీ కంపెనీని ఆదుకొనేందుకు రాష్ట్రంలోని బీజేపీ సర్కారు ఎక్కడలేని దయ చూపించింది. ఏకంగా చట్టాన్నే మార్చేసింది. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదికను మార్చివేసి అదానీ పవర్ నుంచి కొనే విద్యుత్తుకు యూనిట్ ధరను రూ.4.5గా 2018 డిసెంబర్ 1న నిర్ణయించింది. దీనికి కెపాసిటీ చార్జీలు అదనం. ధర పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అదానీ పవర్‌తో 2018 డిసెంబర్ 5న అనుబంధ ఒప్పందం చేసుకొన్నది. దీంతో అదానీ పవర్‌కు కరెంటు ధరను ఎప్పుడైనా, ఎంతైనా పెంచేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రైవేటు సంస్థలు ఇంతగా ధరలు పెంచుతుండగా ప్రభుత్వం వాటిని ఎలా క్రమబద్ధం చేస్తుందని ఎవరికైనా సందేహం రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా అక్కడ కరెంటు చార్జీలు కూడా పెంచలేదు. మరి ఎలా? ఎలాగంటే.. ‘ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) అనే చార్జీలు ఉంటాయి. గృహ వినియోగదారులపై ఈ చార్జీలు వేస్తారు. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఈ చార్జీని చక్కగా వాడుకొంటున్నది. ప్రతినెలా గృహ వినియోగదారుల నుంచి ఎఫ్‌పీపీపీఏ చార్జీల రూపంలో వేలకోట్లు వసూలు చేస్తున్నది. సామాన్య వినియోగదారుడు తన కరెంటు బిల్లు ఎందుకు పెరిగిందో కూడా అర్థంకాకుండానే ఎఫ్‌పీపీపీఏ చెల్లించేస్తున్నాడు. 2021-22 మధ్య ప్రభుత్వం ఈ ఎఫ్పీపీపీఏను ఏకంగా 8 సార్లు పెంచిందంటే ప్రభుత్వ దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అర్థంచేసుకోవచ్చు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే 2023 జనవరిలో మళ్లీ ఈ చార్జీలను ప్రభుత్వం పెంచింది.
హర్యానాలో కూడా అదానీ పవర్‌పై అక్కడి బీజేపీ-జేజేపీ ప్రభుత్వం అంతులేని కరుణ చూపింది. గతంలో అదానీ పవర్ హర్యానా ప్రభుత్వానికి 1,424 మెగావాట్ల విద్యుత్తును యూనిట్‌కు రూ.2.94 చొప్పున చెల్లించేందుకు 25 ఏండ్ల ఒప్పందం చేసుకొన్నది. 2020 నుంచి ఆ సంస్థ ఒప్పందం ప్రకారం 1,424 మెగావాట్లు సరఫరాచేయటంలో విఫలమై 1,096 మెగావాట్లు మాత్రమే సరఫరా చేస్తున్నది. అంటే ఒప్పందంలో ఆ సంస్థ డిఫాల్ట్ అయ్యింది. లోటు ఏర్పడిన 328 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం వేరే సంస్థల నుంచి అత్యధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ఒప్పందం ప్రకారమైతే అదానీ పవర్ నుంచి హర్యానా సర్కారు నష్టపరిహారం వసూలు చేయాలి. కానీ, అక్కడి బీజేపీ సర్కారు అదానీ పవర్‌కు ఇంకా మేలుచేసే పనిచేసింది. ఆ కంపెనీ నుంచి 1,096 మెగావాట్ల విద్యుత్తును యూనిట్‌కు రూ.3.50కు కొనుగోలు చేసేందుకు ఈ నెల 1న ఒప్పందం చేసుకొన్నది. నిజానికి విద్యుత్తు ధరను పెంచేలా ఆదేశాలివ్వాలని అదానీ పవర్ గతంలో వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినా, హర్యానా ప్రభుత్వం ఒప్పందానికి విరుద్ధంగా యూనిట్ రేటు పెంచి, సరఫరా చేసే విద్యుత్తు మొత్తాన్ని తగ్గించేందుకు అంగీకరించటం గమనార్హం.