Mehbooba Mufti : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు వెల్లడవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకాలని కూటమి నేతలు పీడీపీని కోరుతున్నారు. అయితే తాము ఎప్పుడూ ఒంటరిగానే పోరాడామని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.
తమ పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల తోడ్పాటుతో ఒంటరిగానే పోరాడామని చెప్పారు. మెహబూబా ముఫ్తీ బుధవారం శ్రీనగర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను తొలగించేందుకు పోరాడామని చెప్పారు. కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధిస్తుందని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో విజయం సాధిస్తే పాకిస్తాన్‌తో చర్చల పునరుద్ధరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా అని ప్రశ్నించగా తమ మేనిఫెస్టోలో అన్ని అంశాలూ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని, తమ కూటమి మెరుగైన సామర్ధ్యం కనబరిచి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి తాము బీజేపీకి వ్యతిరేకంగా యునైటెడ్ ఫ్రంట్‌గా జట్టు కట్టామని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షులు ఒమర్ అబ్దుల్లా అంతకుముందు వ్యాఖ్యానించారు.
Read More :
Malayalam Actor Siddique | నటి ఆరోపణలు.. మలయాళ నటుడు సిద్ధిఖీపై కేసు నమోదు