Malayalam Actor Siddique | మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదిలావుంటే సిద్ధిఖీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రేవతి సంపత్. తనను రేప్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.
ఇక రేవతి సంపత్ ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న తిరువనంతపురం పోలీసులు సిద్ధిఖీపై అత్యాచారం సహా నాన్ బెయిలబుల్ నేరాల కింద కేసులు నమోదు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక ఆరోపణలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి మహిళా నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే.. సిద్ధిఖీ తనను ట్రాప్ చేసి రేప్ చేశాడంటూ రేవతి సంపత్ ఆరోపించింది. ఒక సినిమా గురించి సిద్ధిఖీ వద్దకు వెళ్లినప్పుడు నాపై అత్యచారం చేశాడు. తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడు అంటూ రేవతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రేవతి సంపత్ చేసిన వ్యాఖ్యలు మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. అయితే మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది.