పాట్నా: బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో .. ముఖ్య పార్టీల మధ్య ఓట్ల షేరింగ్(Bihar Vote Share) సమంగా జరిగినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూతో పాటు మహాగట్‌బంధన్‌లోని ఆర్జేడీ పార్టీకి.. బీహారీ ఓటర్లు పట్టం కట్టారు. ఈ మూడు పార్టీలతో పాటు లోక్‌జన శక్తికి కూడా ఎక్కువ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘంకు చెందిన వెబ్సైట్ ప్రకారం .. ఓట్ షేర్లో బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపించింది. ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ దాటినట్లు తాజా ట్రెండ్స్ వెల్లడిస్తున్నాయి. కానీ ఓట్ షేర్లో మాత్రం మహాగట్బంధన్కు చెందిన ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు పోలైనట్లు స్పష్టం అవుతున్నది.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. బీహార్ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీలోకి దిగారు. తాజా సమాచారం ప్రకారం ఆ పార్టీకి అత్యధికంగా 22.77 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, జేడీయూ కన్నా ఎక్కువ సంఖ్యలో ఆర్జేడీ పార్టీ ఓట్లను రాబట్టినట్లు ఈసీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. ఇక ఓట్ షేర్లో రెండవ స్థానంలో బీజేపీ ఉన్నది. కాషాయం పార్టీకి 20.85 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. మూడవ స్థానంలో ఉన్న జేడీయూకి 18.96 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఓట్లు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓట్ షేర్లో చివరి వరకు మార్పులు జరిగే అవకాశం ఉన్నది.
వాస్తవానికి ఆర్జేడీ, బీజేపీ, జేడీయూలు.. మెజారిటీ ఓట్లను తమ బుట్టలో వేసుకున్నాయి. బీజేపీ, జేడీయూకు చెందిన కూటమి విజయం సాధించినా.. అనూహ్య రీతిలో ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. ఆర్జేడీకి ఇప్పటికే 71 లక్షలు, బీజేపీకి 65 లక్షలు, జేడీయూకి 59 లక్షల ఓట్లు పడ్డాయి. ఆ ఫిగర్ ఇంకా మారే అవకాశం ఉన్నది. బీహార్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న చిరాగ్ పాశ్వాన్ కూడా కీలక ఓట్ల శాతాన్ని తన వైపు తిప్పుకున్నారు. ఓట్ షేర్లో లోక్‌జనశక్తికి ఆరు శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్లో 8 శాతం ఓట్లు పోలయ్యాయి.
బీహార్‌లోని ఇతర పార్టీలకు సుమారు 13 శాతం ఓట్లు పడ్డాయి. ఆ గ్రూపులో ప్రశాంత్ కిషోర్ పార్టీ కూడా ఉన్నది. తాజా సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 208, మహాగట్బంధన్ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.