న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలంలో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన కేసీఆర్కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్పారు. రాజ్యసభలో పదవీకాలం పూర్తయ్యే సభ్యులకు సభ గురువారం వీడోలు పలికింది. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఇరవై నెలల తన పదవీకాలంలో అటు పాత పార్లమెంట్, ఇటు కొత్త పార్లమెంట్ భవనాల్లో కూర్చునే అవకాశం దొరకడం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తమ పార్టీ తరపున మాట్లాడే అవకాశం రావడం చారిత్రక సంఘటనగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సమ్మక సారలమ్మ గిరిజన యూనివర్సిటీ తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు కావడం మరిచిపోలేనిదని చెప్పారు. కేంద్రం నిధుల మంజూరులో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.