న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రభుత్వం గురువారం లోక్సభలో లిస్టింగ్ చేసింది. బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాజ్యాంగ(131 సవరణ) బిల్లు, 2026, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, 2026, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు(సవరణ బిల్లు), 2026ను లోక్సభలో ప్రవేశపెట్టి, చర్చించి ఆమోదిస్తారు.
మొదటి రెండు బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతారు. మూడవ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెడతారు. లోక్సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఈ చర్చ కోసం 18 గంటల సమయాన్ని కేటాయించింది. ఇది శుక్రవారం వరకు కొనసాగవచ్చు. లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లులను రాజ్యాసభ చేపడుతుంది. ఈ బిల్లుల ఆమోదానికి మూడు రోజులపాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశమవుతున్నది.
ముసాయిదా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను అనుసరించి 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు లోక్సభ సీట్లను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచనున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా సీట్లను పెంచనున్నారు. లోక్సభ, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ చేసిన సీట్లను ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిలో కేటాయించాలని లోక్సభ సభ్యులకు పంపిణీ చేసిన ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు.
ఇతర నిబంధనలతోపాటు ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించాలని కోరుతున్నది. లోక్సభలో రాష్ర్టాల్లోని ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్న 815 మందికి మించని సభ్యులు ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించడానికి పార్లమెంట్ చట్టం ద్వారా నిర్దేశించిన పద్ధతిలో ఎన్నుకోబడిన 35 మందికి మించని సభ్యులు ఉంటారు అని ముసాయిదా బిల్లు పేర్కొన్నది.
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అన్ని రాష్ర్టాల్లోని లోక్సభ సీట్ల సంఖ్య సగానికి పెరుగుతుందని, ఏ రాష్టం పార్లమెంట్లో తన ప్రస్తుత దామాషా బలాన్ని కోల్పోదని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గురువారం పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై చర్చ ప్రారంభమైనపుడు దీనిపై హోం మంత్రి అమిత్ షా స్పష్టతనిస్తారని ఆయన తెలిపారు. లోక్సభలో అన్ని రాష్ర్టాల సీట్ల సంఖ్యను 50% పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఎలాంటి మార్పులేదు అని ఆ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.