న్యూఢిల్లీ, మార్చి 10: మలి విడత పార్లమెంట్ సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు, జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుకు సంబంధించి లోక్‌సభలో తీవ్ర స్థాయిలో వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. ఎన్ఈపీ అమలుపై లోక్‌సభలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తమిళనాడుకు చెందిన డీఎంకే సభ్యుల మధ్య పరస్పర విమర్శల పర్వం కొనసాగింది. ఎన్ఈపీ అమలు పేరిట రాష్ట్ర విద్యా శాఖకు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడాన్ని డీఎంకే సభ్యులు నిలదీయగా ఎన్ఈపీకి సంబంధించిన అవగాహనా ఒప్పందంపై తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని ప్రధాన్ తప్పుపట్టారు. దీనిపై తీవ్ర స్థాయిలో వాగ్వివాదం రేగింది.
ఓటర్ల జాబితా అక్రమాలను లోక్‌సభ జీరోఅవర్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికత, నిజాయితీపై వస్తున్న అనుమానాలపై సవివరంగా చర్చించాలని డిమాండు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించగా సభాధ్యక్షుడు అనుమతించలేదు. దీంతో ప్రతిపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. తప్పుడు ఓటర్ల జాబితాలపై సభ చర్చించాలని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
డీఎంకేపై విమర్శలు గుప్పించిన ప్రధాన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ నిప్పులు చెరిగారు. ప్రధాన్ తానో రాజునని భావిస్తూ అహంకారంతో మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని స్టాలిన్ హెచ్చరించారు.
జాతీయ విద్యా విధానం అమలుకు నిరాకరించి తన రాజకీయాల కోసం ఈ అంశంపై యూటర్న్ తీసుకుందంటూ తమిళనాడు ప్రభుత్వంపై ధర్మేంద్ర ప్రధాన్ చేసిన విమర్శలు లోక్‌సభలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర నిరసనను తెలియచేశారు. పీఎం శ్రీ పథకం కోసం కేంద్రం నిధులు విడుదల చేయడం లేదంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు ప్రధాన్ సమాధానమిస్తూ ‘వారికి(డీఎంకే) నిజాయితీలేదు. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును వారు నాశనం చేస్తున్నారు’ అంటూ ఆరోపించారు. దీనికి డీఎంకే సభ్యులు స్పందిస్తూ ఎన్ఈపీని తాము పూర్తిగా అనుమతించేది లేదని, త్రిభాషా సూత్రం తమిళనాడుకు ఆమోదయోగ్యం కాదని ఏనాడో తాము కేంద్రానికి స్పష్టం చేశామని తెలిపారు.