జైపూర్: భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో ఒక జంట మరణించడాన్ని స్థానికుడు గుర్తించాడు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు సమాచారం ఇచ్చాడు. ఆధారాలు పరిశీలించగా పాక్‌కు చెందిన కొత్తగా పెళ్లైన జంటగా తెలిసింది. (Pakistani Couple Found Dead) డీహైడ్రేషన్ వల్ల వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. రాజస్థాన్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు 11 కిలోమీటర్ల దూరంలో యువతీ, యువకుడి మృతదేహాలను స్థానిక గొర్రెల కాపరి శనివారం చూశాడు. బీఎస్ఎఫ్కు సమాచారం అందించాడు.
కాగా, బీఎస్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాల వద్ద లభించిన ఓటరు గుర్తింపు పత్రాల ఆధారంగా పాకిస్థాన్‌లోని సింధ్ జిల్లాకు చెందినవారని తెలిసింది. మృతులను 17 ఏళ్ల రవి కుమార్, 15 ఏళ్ల శాంతి బాయిగా గుర్తించారు. పాక్ మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ కూడా వారి వద్ద ఉన్నది. యువకుడి నోటి వద్ద వ్యాటర్ క్యాన్ ఉన్నది. ఈ నేపథ్యంలో తీవ్ర దప్పిక, డీహైడ్రేషన్ వల్ల వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. యువతి చేతులకు ఉన్న గాజుల ఆధారంగా వారికి కొత్తగా పెళ్లైనట్లు తెలుస్తున్నది.
మరోవైపు పాక్ హిందువులైన ఈ జంట అక్కడి మతపరమైన హింసను భరించలేక భారత్‌కు వచ్చేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల వారు వీసా పొందలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన ఈ జంట భారత్‌లో కొత్త జీవితం గడిపాలని భావించిందని పోలీసులు తెలిపారు.
కాగా, జూన్ 21న పాకిస్థాన్‌లో తమ ఇళ్లను ఈ జంట వీడినట్లు తెలిసిందని, నూర్పూర్ దర్గా సమీపంలో వారు ప్రయాణించిన బైక్ కనిపించిందని, ఆ తర్వాత వారి కుటుంబాలతో కాంటాక్ట్ లేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కాలినడకన భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఈ జంట డీహైడ్రేషన్ వల్ల వారు చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. భారత్‌లో వారి తరుఫు గురించి ఆరా తీయగా ఇక్కడ బంధువులు ఎవరూ లేనట్లు తెలిసిందన్నారు. ఆ జంట మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
live-in couple arrested | నవజాత శిశువుల ఎముకలు లభ్యం.. సహజీవనం చేస్తున్న జంట అరెస్ట్
Watch: భారీ వర్షాలకు కుంగిన రోడ్డు.. బైక్‌తోపాటు గుంతలో పడిన వ్యక్తి