Simla Agreement | జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రదాడి ఘటనతో పాకిస్థాన్- భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడితో రెండు దేశాలు ప్రతీకార చర్యలకు పూనుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్ (Pakistan)పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించింది. ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ సిమ్లా ఒప్పందాన్ని (Simla Agreement) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ సిమ్లా ఒప్పందం ఏంటన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ ఒప్పందం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1971లో భారత్ – పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే లక్ష్యంతో 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. ఇది 1972, జులై 2వ తేదీన హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అదే ఏడాది ఆగస్ట్ 4వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి. ఇందులో కశ్మీర్ అంశమూ ఉంది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల మధ్య ఏమైనా వివాదాలు, సమస్యలు తలెత్తితే శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఇందులో మూడో పక్షం జోక్యం ఉండదు. అదేవిధంగా జమ్ము కశ్మీర్లో కాల్పుల విరమణకు నియంత్రణ రేఖను గుర్తించి.. దానికి ఏకపక్షంగా మార్చకూడదని నిర్ణయానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాలి.
అయితే, ఈ ఒప్పందం రద్దుతో ఒరిగేదేమీ లేదని నిపుణుల అభిప్రాయం. ఈ ఒప్పందానికి ఒక అర్థమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ ప్రతిరోజూ ఉల్లంఘణలకు పాల్పడుతోంది. పాక్ నిర్ణయం.. భారత్‌కు కలిసొచ్చే అంశమన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కశ్మీర్ సమస్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో భారత్‌కే ఉపయోగపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం రద్దు వల్ల భారత్‌కు కొత్తగా వచ్చే నష్టమేమీలేదని నిపుణుల అభిప్రాయం.
Also Read..
Pahalgam Attack | కశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా దళాలు