న్యూఢిల్లీ, జూన్ 8: లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలపకపోవడంపై పాకిస్థాన్ స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శనివారం ముంతాజ్ జహ్రా బలోచ్ మాట్లాడుతూ దేశ నాయకత్వాన్ని ఎంచుకోవడం అనేది భారతీయ పౌరుల హక్కు అని అన్నారు.
భారత ఎన్నికల ప్రక్రియపై తాము ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదని, అయినా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే భారత ప్రధాని గురించి మాట్లాడటం ముందస్తు చర్య అవుతుందని ఆమె పేర్కొన్నారు. భారత్ సహా తాము అన్ని పొరుగు దేశాలతో స్నేహపూర్వక, సహకార సంబంధాలు కోరుకుంటామని చెప్పుకొచ్చారు. భారత్తో సంబంధాలపై బలోచ్ మాట్లాడుతూ అన్ని వివాదాలను నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు.