న్యూఢిల్లీ, నవంబర్ 15: ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధికం) జరపడమే ఈ మార్పుకు కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ 10 నెలల తన పాలనా కాలంలోనే రెండుసార్లు వైట్‌హౌస్‌లో పాక్ నేతలతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా-భారత్ సంబంధాలు ఈ 10 నెలల కాలంలోనే అత్యంత క్షీణదశకు చేరుకున్నాయి. అసలు కారణం ఏమిటంటే ట్రంప్ సన్నిహితులు నడుపుతున్న లాబీయింగ్ సంస్థలకు పాక్ 50 లక్షల డాలర్లను ముట్టచెప్పడమని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. విడతల వారీగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ట్రంప్ దృష్టిలోకి పాక్ వచ్చింది. ట్రంప్ పాలనలో ప్రతి పనికీ ఓ ధర ఉంటుంది. వైట్ హౌస్‌ను చేరుకోవడానికీ ఇది వర్తిస్తుంది. జరిగిన పరిణామాల కాలక్రమాన్ని బట్టి పాక్‌కు ఈ ఒప్పందాలు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.