Mysore Pak | జైపూర్: పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఏకం చేసింది. దీనికి కారణమైన పాకిస్థాన్ పేరును కూడా ఉచ్ఛరించేందుకు ప్రజలు ఇష్టపడలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి. మైసూర్‌పాక్ పేరులోని ‘పాక్’ను తొలగించి మైసూర్”భారత్’ అని పేరు పెట్టాలంటూ నెటిజన్లు సరదాగా డిమాండ్ చేశారు. ఇది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్‌ను ఆకర్షించింది. దేశభక్తిని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపించాలని భావించి తన షాప్‌లో విక్రయించే స్వీట్లలో ‘పాక్’ పేరుతో ముగిసే వాటి పేర్లను మార్చేశారు.
అందులో అందరికీ సుపరిచితమైన, ఇష్టమైన మైసూర్ పాక్ కూడా ఉంది. దీని పేరును ఆమె ‘మైసూర్ శ్రీ’ అని మార్చేశారు. మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ స్వీట్లకు చివరన ఉన్న పాక్ పేరు తొలగించి.. మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీగా నామకరణం చేశారు. అంతేకాదు, షాప్‌లో అత్యంత ఖరీదైన స్వర్ణ భస్మ్ పాక్, చాందీ భస్మ్ పాక్ పేర్లను కూడా స్వర్ణ శ్రీ, చాందీశ్రీగా మార్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వినియోగదారుల్లో మార్పు వచ్చిందని, స్వీట్ల చివరన ఉన్న పాక్ అని ఉంటే కొనేందుకు ఇబ్బందిపడుతున్నారని, వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.