Terror attack : పహల్గాం (Phahalgam) సమీప బైసరన్ లోయలో ఉగ్రవాదులు (Terrorists) సైనిక దుస్తుల్లో వచ్చి దాడులకు తెగబడ్డారు. మొత్తం ఐదుగురు ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో మొత్తం 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి (Terror attack) నుంచి బయటపడిన పలువురు బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడంతో.. దాడి అనంతరం బాధితులను రక్షించేందుకు వచ్చిన సైనికులను చూసి కూడా జనం గడగడ వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ వచ్చారనుకుని భీతిల్లారు. సైనికులను చూసిన ఓ మహిళ తన కొడుకును ఏమీ చేయవద్దని బోరున విలపించింది. చేతులు జోడించి వేడుకుంది. ఇతర పర్యటకులు భయంతో తమ పిల్లలను తమ వెనుక దాచుకున్నారు.
దాంతో ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్పారు. తాము భారత ఆర్మీ నుంచి మిమ్మల్ని రక్షించడానికే వచ్చామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదేవిధంగా ఉగ్రవాదుల దాడిలో తన భర్త మరణాన్ని చూసి షాక్‌కు గురైన ఓ మహిళ అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారని, బాధతో రోదిస్తూనే ఉన్నారని భద్రతా బలగాలు తెలిపాయి.
కాగా జమ్ముకశ్మీర్‌లో పౌరులే లక్ష్యంగా జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడుల్లో ఇది కూడా ఒకటి. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ‘లష్కరే తోయిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ మారణహోమానికి తామే పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఉగ్రదాడి జరిగింది. దుండగులు అతి సమీపం నుంచి తూటాల వర్షం కురిపించారు.
మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడికి దిగారు. 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.