ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ కేంద్రంగా కుట్ర జరిగినట్టు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నిర్ధారించింది. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ పర్యవేక్షణలో తయారు చేసిన ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఉగ్రదాడిలో లష్కరే తాయిబా (ఎల్ఈటీ), ఐఎస్ఐ, పాకిస్థాన్ ఆర్మీల ప్రత్యక్ష పాత్ర ఉన్నట్టు స్పష్టం చేసింది.
ఈ నివేదికను ఎన్ఐఏ త్వరలోనే హోం శాఖకు సమర్పించనున్నట్టు తెలిసింది. దాడి జరిపిన ఉగ్రవాదులు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని వారి నిర్వాహకులతో నిత్యం సంప్రదింపులు జరిపేవారని, విజయవంతంగా వీరు సరిహద్దును దాటేందుకు జరిపిన ఆపరేషన్‌కు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఈ విషయాన్ని నిర్ధారించాయన్నారు.
దాడికి ముందే ఉగ్రవాదులు మారణాయుధాలను బేతాబ్ లోయలో దాచి ఉంచారని, ఈ దాడికి స్థానిక ఓవర్‌గ్రౌండ్ వర్కర్స్ (ఓడబ్ల్యూజీలు) సహకారం అందించారని తేలిందన్నారు. ఈ నివేదిక హోం శాఖకు చేరిన తర్వాత ఉగ్రవాదులకు సహకారం అందించే స్థానిక నెట్‌వర్క్‌లపై, సరిహద్దు దాటడానికి సహకరించే శక్తులపై తీవ్ర చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.