Pahalgam Attack | పహల్గాం : జమ్ము కశ్మీరులోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. గడచిన ఐదు రోజులలో కనీసం నాలుగుసార్లు ఉగ్రవాదుల ఆచూకీని భద్రతా దళాలు గుర్తించాయి. ఒక సందర్భంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల పోరు కూడా సాగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, నిఘా వర్గాలు, గాలింపు చర్యల ద్వారా ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం లభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనిపించినట్లే కనిపించి ఉగ్రవాదులు అడవుల్లో మాయమవుతున్నారని, దట్టమైన అడవులు కావడంతో ఉగ్రవాదుల ఆచూకీ లభించినా వారిని వేటాడడం కష్టతరంగా మారిందని చెప్పాయి.
పహల్గాం దాడిలో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీయులతో సహా నలుగురు ఉగ్రవాదుల కోసం సైన్యం, కేంద్ర సాయుధ పోలీసులు, జమ్ము కశ్మీరు పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొదటిసారి అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం తెహసిల్ హపత్ నార్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు కనిపించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వారు భద్రతా సిబ్బంది చేతికి చిక్కకుండా తప్పించుకు పారిపోయారు. రెండవసారి కుల్గాం వద్ద అడవుల్లో కనిపించిన ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపి అడవిలోకి పారిపోయారు. ఈ నలుగురు ఉగ్రవాదులు మరోసారి కోకర్నాగ్ వద్ద కంటపడ్డారు. అయితే భద్రతా దళాల రాకను పసిగట్టి వారు అడవిలోకి పారిపోయారు. ప్రస్తుతం ఉగ్రవాదులు ఆ పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు.
కశ్మీర్లో కల్లోలం సృష్టించేందుకు పాక్ తన వ్యూహాన్ని మార్చిందని, శిక్షణ పొందిన ఉగ్రవాదులకు ‘ట్రైనింగ్ వీసా’ అందజేస్తున్నట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్వోసీ వద్ద భద్రతా బలగాలకు దొరకకుండా ఉండేందుకు చట్టబద్ధమైన పత్రాలను (ట్రైనింగ్ వీసా) అందజేస్తున్నట్టు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో పాక్‌కు వెళ్లి, ఉగ్రవాద గ్రూపుల్లో చేరినట్టు వార్తా కథనాలు పేర్కొన్నాయి. తిరిగి కొంతమంది ఉగ్రవాదులతో అతడు 2024లో భారత్‌కు చేరుకున్నాడట. ఇలా ‘ట్రైనింగ్ వీసా’లతో 300 మందికిపైగా జమ్ముకశ్మీర్ యువకులు పాక్‌లోకి ప్రవేశించారని, ఇందులో కనీసం 40 మంది విదేశీ ఉగ్రవాదులకు హ్యాండ్లర్లుగా మారారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.