Loksabha Elections 2024 : కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నేర చట్టాలను కూడా తొలగిస్తామని చెప్పారు. వీటి స్ధానంలో నూతన చట్టాలను తీసుకొస్తామని తెలిపారు.
సీఏఏపై కాంగ్రెస్ మౌనం దాల్చుతోందని సీపీఎం నేతల ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. సీఏఏకు వ్యతిరేకంగా తమ పార్టీ నేత శశి థరూర్ పలుమార్లు మాట్లాడారని గుర్తుచేశారు. సీఏఏను తాము వ్యతిరేకిస్తామని ప్రియాంక గాంధీ కూడా తెలిపారని కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చీఫ్ చిదంబరం వివరించారు.
కాగా ఇటీవల కేరళలో జరిగిన ర్యాలీలో సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీఏఏపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ తీరు సంఘ్ పరివార్ వైఖరిని తలపిస్తోందని దుయ్యబట్టారు. సీఏఏను వ్యతిరేకిస్తూ తొలుత లెఫ్ట్ఫ్రంట్తో జతకట్టిన కేరళ కాంగ్రెస్ విభాగం ఆపై అధిష్టానం సూచనతో తమతో కలిసి రాలేదని విజయన్ మండిపడ్డారు.
Read More :