న్యూఢిల్లీ, జూన్ 16: దగ్గు మందులతోసహా సిరప్ ఆధారిత మందుల ఓవర్-ది-కౌంటర్(వైద్యుని ప్రిస్క్రిప్షన్‌ను లేకుండా నేరుగా కొనుగోలు చేసే) అమ్మకాలను నిలిపివేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఔషధ నియంత్రణ నిబంధనలను సవరించింది. వీటి కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జూన్ 9న ఆరోగ్య మంత్రిత్వశాఖ నోటిఫై చేసిన డ్రగ్స్ రూల్స్, 1945 సవరణ ద్వారా అమల్లోకి తెచ్చిన డ్రగ్స్(ఐదవ సవరణ) నిబంధనలు 2026 కింద ఈ మార్పు జరిగింది. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ చట్టం, 1940 నిబంధనల నుంచి మినహాయింపు పొందిన ఔషధాల క్యాటగిరీల్లో పేర్కొన్న షెడ్యూల్ కే నుంచి సిరప్లు అనే పదాన్ని సవరించిన నిబంధనల కింద తొలగించారు.
దీని ఫలితంగా సిరప్ తయారీ ఇక మినహాయింపులకు నోచుకోదు. ఔషధ నియంత్రణ నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. గతంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ దుకాణాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్న దగ్గు మందు సహా ఇతర సిరప్లు ఇక లభించవు. వాటి కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇక తప్పనిసరి. ఔషధ నియంత్రణకు సంబంధించి దేశంలో అత్యున్నత సాంకేతిక సంస్థ డ్రగ్స్ టెక్నికల్ సలహా బోర్డుతో సంప్రదించిన తర్వాతే ఈ సవరణ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.