ఇంఫాల్: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. (Massive Student Protest) సోమవారం ఇంఫాల్‌లోని రాజ్‌భవన్ ఎదుట పెద్ద సంఖ్యలో బైఠాయించారు. హింసాత్మక ఘటనలు పెరుగడంతో రాష్ట్రంలో విద్యాసంస్థలను సెప్టెంబర్ 9, 10న మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. స్కూల్ యూనిఫారం ధరించిన విద్యార్థులు గవర్నర్‌ను కలిసి తమ నిరసన తెలిపేందుకు పట్టుబట్టారు.
కాగా, మణిపూర్‌లో ఏడాదిన్నర కాలంగా కుకీ, మైతీ జాతుల మధ్య సంఘర్షణ కొనసాగుతున్నది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా మోహరించిన కేంద్ర బలగాలు శాంతిని పునరుద్ధరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర అదనపు బలగాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్ర భద్రతా సలహాదారుని తొలగించాలని, యూనిఫైడ్ కమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే డ్రోన్, తుపాకీ దాడులకు నిరసనగా శుక్రవారం
ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో వేలాది మంది స్త్రీ, పురుషులు మానవ హారం ర్యాలీలో పాల్గొన్నారు.