న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఇండిగో (IndiGo) నిర్వహణ సంక్షోభం వరుసగా ఏడవ రోజు సోమవారం కూడా కొనసాగింది. దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాలలో 500కి పైగా విమాన సర్వీసులు రద్దు (Flights Cancelled) కాగా వేలాదిమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. తాను నడిపే 138 రూట్లలోని 137 రూట్లలో సోమవారం 1,802 విమానాలను నడపాలని ఇండిగో నిర్ణయించుకున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటికే ప్రయాణికులకు చెందిన దాదాపు 4,500 బ్యాగులను ఇండిగో అంద చేయగా మిగిలిన 4,500 బ్యాగులను వచ్చే 36 గంటల్లో చేరవేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఒక్క బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే 127 ఇండిగో విమానాలు సోమవారం రద్దయ్యాయి. వీటిలో 65 అరైవల్స్, 62 డిపార్చర్స్ ఉన్నాయి.
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వీటిలో 38 అరైవల్స్, 39 డిపార్చర్స్ ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యధికంగా 134 విమానాలు రద్దయ్యాయి. వీటిలో 75 డిపార్చర్స్, 59 అరైవల్స్ ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 8 గంటల సమయానికి 18 విమానాలు రద్దు కాగా ముంబై, చెన్నై, జైపూర్, గువాహటిలో కూడా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాలలో చిక్కుకుపోయిన వేలాదిమంది ప్రయాణికులు విమానాల పునరుద్ధరణ సమాచారం కోసం అక్కడే వేచిచూస్తున్నారు.
రూ.827కోట్ల రిఫండ్ల చెల్లింపు
డిసెంబర్ 1 నుంచి 7 మధ్యకాలంలో జరిగిన 5.86 లక్షల పీఎన్ఆర్‌ల రద్దుకు సంబంధించి రూ.569.65 కోట్ల రిఫండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు 9.55 లక్షల పీఎన్ఆర్లు రద్దు కాగా వాటికి రూ.827 కోట్ల రిఫండ్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది.
ఇండిగోపై తీవ్ర చర్యలు: మంత్రి
విమానయాన పరిశ్రమవ్యాప్తంగా ఓ ఉదాహరణ నెలకొల్పేందుకు ఇండిగోలో ఏర్పడిన తాజా సంక్షోభంపై తీవ్రమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. ఇండిగో అంతర్గత వైఫల్యాల ఫలితమే ఈ అవాంతరాలని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తెలిపారు. తన సిబ్బంది, డ్యూటీ మస్టర్ నిర్వహణలో ఇండిగో విఫలమైందని ఆయన నిందించారు. ఈ పరిస్థితిని తాము తేలికగా తీసుకోవడం లేదని, దీనిపై విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఈ పరిస్థితికే కాదు.. ఓ ఉదాహరణగా కూడా ఈ వ్యవహారంపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. 2025 ఏప్రిల్ హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ప్రవేశపెట్టిన సవరించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(ఎఫ్డీటీఎల్) గురించి కూడా మంత్రి వివరించారు. మొత్తం 22 మార్గదర్శకాలలో జూలై 1న 15 మార్గదర్శకాలను అమలు చేయగా నవంబర్ 1న మిగిలిన 7 మార్గదర్శకాలను అమలు చేసినట్లు ఆయన చెప్పారు. భద్రత విషయంలో ఎటువంటి రాజీలేకుండా తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలపై ఇండిగో సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో అనేక సార్లు సంప్రదింపులు జరిపినట్లు మంత్రి వివరించారు.
తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు
ఇదిలా ఉండగా వందలాది ఇండిగో విమానాల రద్దులో న్యాయవ్యవస్థ జోక్యాన్ని కోరుతూ ఓ న్యాయవాది దా ఖలుచేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. ఇది తీవ్రమైన అంశమే, అయితే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఇప్పటికే పరిగణనలోకి తీసుకుని చర్యలు చేపట్టిందని కోర్టు తెలిపింది. కచ్చితమైన కారణాలు ఇప్పుడే చెప్పలేం సర్వీసుల రద్దుపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందించింది. గందరగోళానికి గల కారణాలను గుర్తించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది. అనేక అంశాలు ప్రభావం చూపడం వల్లే ఆటంకం ఏర్పడిందని తెలిపింది. ఐదు అంశాలు ప్రాథమికంగా గుర్తించామని పేర్కొంది. సాంకేతిక లోపాలు, విమానాల షెడ్యూళ్లను మార్చడం, ప్రతికూల వాతావరణం, పెరిగిన రద్దీ, కొత్తగా అమల్లోకి వచ్చిన రోస్టర్ నియమాలు ప్రధాన కారణాలుగా తెలిపింది.