రుద్రప్రయాగ్: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు వేద మంత్రోచ్ఛారణతో కేదార్నాథుని ఆలయ తలుపులు తెరచుకున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు అధికారిక గణాంకాల ప్రకారం 30 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 19,196 మంది పురుషులు ఉండగా, 10,597 మంది మహిళలు, 361 మంది ఇతరులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి. చార్ధామ్ యాత్రలో కేదార్ నాథ్ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ప్రతి ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్నాథ్కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. శీతాకాలంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఆలయ తలుపులు మూసే ఉంటాయి. ఆ సమయంలో ఆలయం మొత్తం మంచుతో కప్పుకుపోయి ఉంటుంది. తిరిగి వేసవిలో ఈ ఆలయ తలుపులు తిరిగి తెరుస్తారు. కాగా, బద్రినాథ్ ఆలయం ఈ నెల 4న తెరచుకోనుంది.