న్యూఢిల్లీ: తమ కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని పహల్గామ్ బాధిత కుటుంబాలు వాపోయాయి. (Pahalgam Victims Families) భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ మైదానంలో పాక్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పర్యాటకులతో సహా 26 మంది మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ అన్ని విధాలా తెగదెంపులు చేసుకున్నది. మేలో ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక చర్య చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత సుమారు ఐదు నెలలకు ఆదివారం నుంచి దుబాయ్‌లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆసియా కప్ టోర్నీ జరుగనున్నది. అయితే ఈ నిర్ణయం తీసుకున్న బీసీసీఐతో పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. పహల్గామ్ బాధిత కుటుంబాలు కూడా దీనిపై స్పందించాయి. పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆటగాళ్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ‘మా కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఏమిటి?’ అని భర్త, కుమారుడ్ని కోల్పోయిన కిరణ్బెన్ ప్రశ్నించారు.
మరోవైపు ఆమె చిన్న కుమారుడు సావన్ పర్మార్ కూడా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పహల్గామ్ దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఆపరేషన్ సిందూర్‌లో మన సైనికులు కూడా అమరులయ్యారని గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతోందని తెలిసి తాము చాలా కలత చెందినట్లు చెప్పారు. ‘పాకిస్థాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నామని ప్రధాని మోదీ అన్నారు. మరి మనం ఇంకా ఈ ఆట ఎందుకు ఆడుతున్నాం? మేం ఇంకా దుఃఖిస్తున్నాం. ఈ ఆట ఆడాల్సిన అవసరం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు.
Also Read:
Watch: పైజామా లేకుండా టీవీ చర్చలో పాల్గొన్న బీజేపీ నేత.. వీడియో వైరల్