న్యూఢిల్లీ: దేశంలో ఇంగ్లీష్ భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. దేశ ఐక్యతలో భారతీయ భాషలు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఆశుతష్ అగ్నిహోత్రి రాసిన మై బూంద్ స్వయం.. కుద్ సాగర్ హు అన్న పుస్తకాన్ని ఇవాళ మంత్రి రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ భాషల వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన సందర్భంగా వచ్చిందన్నారు. మాతృ భాషలపై గర్వంతో ప్రపంచంలో ముందుకు వెళ్లాలన్నారు. ఈ దేశంలో.. త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు సిగ్గుపడే సందర్భం వస్తుందని, అలాంటి సమాజ ఏర్పాటు ఎంతో దూరం లేదని, పట్టుదలతో మార్పును కోరుకునేవారితో అది సాధ్యం అవుతుందని, మన దేశంలోని భాషలు.. మన సంస్కృతికి రత్నాలని నమ్ముతున్నట్లు చెప్పారు. మన భాషలు లేకుండా మనం ఈ దేశవాసులం కాబోమన్నారు.
ఈ దేశాన్ని, సంస్కృతిని, చరిత్రను, మతాన్ని అర్థం చేసుకోవడనానికి ఏ విదేశీ భాష సరిపోదు అని, అసమగ్రమైన విదేశీ భాషలతో సమగ్రమైన దేశభావన రాదు అని, ఇది చాలా సంక్లిష్టమైన అంశమని, కానీ భారతీయ సమాజం దీంట్లో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని, మరోసారి మన దేశాన్ని మన స్వంత భాషల్లో ముందుకు నడిపిస్తామని అనుకుంటున్నట్లు చెప్పారు.