Kerala | ప్రకృతి అందాలకు నిలయమైన కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వయనాడ్ (Wayanad) జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి 163 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ విలయానికి అధిక వర్షపాతమే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కేరళ వాసులకు పిడుగులాంటి వార్త చెప్పింది.
ఆగస్టు 3వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైన వయనాడ్ జిల్లాతోపాటు మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్లకు ఐఎండీ ‘ఆరెంజ్’ అలర్ట్ (Orange alert) జారీ చేసింది. ఇడుక్కి, త్రిసూర్, ఎర్నాకులం, పాలక్కాడ్ జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. అదేవిధంగా తిరువనంతపురం, కొల్లాం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Kerala | IMD issues ‘Orange’ alert issued in Malappuram, Kozhikode, Wayanad, Kannur, and Kasaragod districts.
‘Yellow’ alert for Pathanamthitta, Alappuzha, Kottayam, Ernakulam, Idukki, Thrissur, and Palakkad.
No rain warnings for Thiruvananthapuram and Kollam. pic.twitter.com/k0iFDXDDrX
— ANI (@ANI) July 31, 2024
వయనాడ్లో మృత్యుఘోష.. 163కు పెరిగిన మరణాల సంఖ్య
వయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 163 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. 32 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అందజేశారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. ఇక ఈ ఘటనలో 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు (Rescue op Continue).
దేవభూమిలో ఊహకందని విషాదం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
కేరళలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పడి, చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మూడుసార్లు కొండచరియలు తెగిపడ్డాయి. దీంతో వందలాది ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. చాలా ఇండ్లు వరద, బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడమని హాహాకారాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు, మనుషుల శరీర అవయవాలు చలియార్ నదిలో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది.
Also Read..
coaching centres | కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం : ఢిల్లీ మంత్రి అతిషీ