చెన్నై: మిత్రపక్షం బీజేపీ తీరుపై అన్నాడీఎంకేలో అసంతృప్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇటీవల ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించినప్పుడు ఆయనను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత పన్నీర్ సెల్వం (ఓపీఎస్) తాజాగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ రాష్ర్టానికి రావాల్సిన రూ.2,151 కోట్ల సర్వశిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కేంద్రం వైఖరి సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ‘కేంద్రం వైఖరి వల్ల విద్యా హక్కు చట్టం ద్వారా 25 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చేరలేకపోయారు. ఈ స్కీమ్ కింద బడుల్లో చేరినవారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది’ అని పేర్కొన్నారు. మోదీ అపాయింట్మెంట్ నిరాకరించడంపై పన్నీర్ సెల్వం సలహాదారు స్పందిస్తూ.. బీజేపీ నీడ నుంచి బయటకు రావాలని తమ నాయకుడికి పిలుపునిచ్చారు.